Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన హార్వెస్టర్ కిరాయి.. గంటకు రూ.4వేలు
- భరించలేమంటున్న అన్నదాతలు
- డీజిల్ పెరుగుదల వల్లే అంటున్న యజమానులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పొలం దున్నకం నుంచి పంట సాగు చేయడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన వరి పంటను కోయించడం మరొక ఎత్తైంది. గతంలో కూలీలు పంటను కోసేవారు. యాంత్రీకరణ పెద్దఎత్తున పెరగడం వల్ల వరికోత మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో కోతలు కోయడం మొదట్లో కొంత సులువుగానే అనిపించినప్పటికి కాలం గడుస్తున్న కొద్దీ భారంగా మారింది. ప్రస్తుతం పెరిగిన డిజిల్ ధరలతో వరికోత మిషన్ల యజమానులు కిరాయి పెంచేశారు. దాంతో రైతన్నకు ఆ ఖర్చులు గుదిబండగా మారాయి.
వరి కోత మిషన్ల కోసం పడిగాపులు
ఈ సీజన్లో సరైన సమయానికి వర్షాలు రావడం, సాగునీటి కాల్వలు పారడం, భూగర్భ జలాలు భారీ స్థాయిలో పెరగడం వల్ల రైతులు పెద్దఎత్తున వరి పంట సాగుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 11,93,120 ఎకరాలు సాగైంది. గతంలో ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ కాలేదు. అయితే చేతికొచ్చిన వరి పంటను కోయడానికి కూలీలు రావ డం లేదు. వచ్చినా సమయం ఎక్కువ పట్టడం వల్ల వరికోత మిషన్ల ద్వారా కోయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. కానీ అవి కూడా సరైన సమయానికి రావడంలేదు. సాగు ఎక్కువగా ఉండటం, మిషన్లు దానికి అనుగుణంగా లేకపోవడంతో ఒక్కొక్క రైతు వారం నుంచి పది రోజుల వరకు మిషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది.
డీజిల్ ధరల పెంపుతో భారం
పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. వరికోత మిషన్ల కిరాయి ఈ సీజన్లో భారీగానే పెరిగాయి. గతంలో టైర్లు ఉన్న వరికోత మిషన్‌కు గంటకు కిరాయి రూ.1800 నుంచి 2వేల వరకు ఉండేది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల రూ.2500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. చైన్ మిషన్‌కు రూ.3500 నుంచి 4000 వరకు తీసుకుంటున్నారు. ఎకరం పంటను కోయడానికి గంట సమయం పడుతుంది. ఇప్పటికి 20శాతం వరి కోతలు కూడా పూర్తికాలేదు. మిషన్ల కిరాయి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి చేర్చడానికి రూ.1000 నుంచి 1500వరకు ఖర్చు అవుతుంది. పంట సాగు చేయడం మొదలైన నాటినుంచి ధాన్యం విక్రయించే నాటికి పెట్టిన పెట్టుబడి లెక్కగడితే కనీసం రైతు శ్రమకు తగిన కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు.
వరికోతకే వేలకు వేలు ఖర్చవుతుంది
నా వ్యవసాయ భూమిలో నాలుగెకరాలు, కౌలుకు పదెకరాలు తీసుకుని సాగు చేసిన. వరికోత మిషన్ కిరాయి పెరిగింది. ఎకరం వరి కోయడానికి సుమారు 4వేలు ఖర్చవుతుంది. సాగు చేయడం ఒక ఎత్తయితే పంటను కోయడానికి అవుతున్న ఖర్చు ఒక ఎత్తయింది.
- కొమిరె రమణయ్య, మలిగిరెడ్డి గూడెం - అనుముల మండలం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సాగు
జిల్లా సాగు దిగుబడి అంచనా
(ఎకరాలు) (మెట్రిక్ టన్నులు)
సూర్యపేట 469250 1126848
యాదాద్రి 276000 5.50లక్షల
నల్లగొండ 447870 1103421