Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోడీ సర్కారు మెడలు వంచి, పొగరు దించుతామని పలువురు వక్తలు హెచ్చరించారు. సనోఫి యాజమాన్యం తమ సంస్థలోని ఉద్యోగులను అకారణంగాతొలగించడాన్నినిరసిస్తూ హెక్ట్స్ ఆల్ ఇండియా రిప్రజెంటీటివ్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి యు.వి.కృష్ణయ్య, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్ యూ) ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని సనోఫి ఇండియా లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. '1947 పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి....సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో మందుల ప్రకటనలను నిలిపివేయాలి...యూనియన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించాలి....కార్మిక చట్టాలను అమలు చేయాలి...ఆన్లైన్ వ్యాపార విధానాలను మానుకోవాలి....దీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న డిమాండ్ ఛార్ట్‌ను సెటిల్ చేయాలి... ఉద్యోగులపై డిజిటల్ పేరుతో నిఘా పెట్టటం మానుకోవాలి'...అని రాసున్న ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొని సనోఫి కార్యాలయ భవనం వసంత్ ఛాంబర్స్ ప్రధాన గేటు పక్కన మూడు గంటలకు పైగా బైఠాయించారు. ధర్నా ముగింపు సమయంలో సనోఫి ఇండియా లిమిటెడ్ రీజినల్ కార్యాలయం హెచ్ఆర్ ప్రభుకుమార్‌కు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు రాజుభట్ మాట్లాడుతూ హెక్ట్స్ర్ ఆల్ ఇండియా రిప్రజెంటీటివ్స్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. సనోఫీ యాజమాన్యం తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 16 బ్రాండ్లను ఇతర కంపెనీకి అమ్మి ఉద్యోగులను కూడా ఆ కంపెనీలోకి బలదలాయించేందుకు సనోఫి యాజమాన్యం చూసిందని విమర్శించారు. కొత్త కంపెనీలో సనోఫిలో ఉన్న హక్కులు, డీఏ, టీఏ, దీర్ఘకాలిక బెనిఫిట్స్ లేవనీ, పనిభారం కూడా పెరుగుతున్నదన్నారు. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులను తొలగించారని తెలిపారు. డిజిటలజైషన్ పేరుతో ఉద్యోగులపై నిఘా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా....కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న బీజేపీ సర్కారు చోద్యం చూస్తున్నదనీ, అంతిమంగా కార్మికవర్గమే గెలుస్తుందని తెలిపారు.
నవంబర్ 22, 23 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
యు.వి.కృష్ణయ్య మాట్లాడుతూ 30 ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను ఇతర కంపెనీల్లోకి మార్చారనీ, దీన్ని వ్యతిరేకించిన 70 మందిని సెప్టెంబర్ 30న తొలగించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డున పడ్డ ఉద్యోగులు ఇప్పటికే కార్మికశాఖకు లేఖ రాశారనీ, సమ్మె చేశారని గుర్తుచేశారు. మరోసారి నవంబర్ 22, 23 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తామనీ,డిసెంబర్ 17న ఛలో ముంబయి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. హెక్ట్స్ ఆల్ ఇండియా రిప్రజెంటీటివ్స్ కమిటీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గత 50 ఏండ్లలో 12 వేతన ఒప్పందాలు, ప్రతి ఏడాది రెండు సార్లు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. 150 ఉత్పత్తులకు గాను సనోఫీ 16 బ్రాండ్లను యూనివర్సల్ న్యూట్రీ సైన్స్ కంపెనీకి అమ్మేస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్న వారిని కొత్త కంపెనీకి పంపిస్తున్నట్టు జులైలో ఏకపక్షంగా ప్రకటించిందని తెలిపారు. వెళ్లేందుకు సిద్ధంగా లేని వారినీ, కొత్త కంపెనీలో పని పద్ధతులు మార్చేసి బలవంతంగా పంపేందుకు ప్రయత్నించి, 70 మందిని తొలగించిందని తెలిపారు.
మెడికల్ రిప్రజెంటీటివ్ లు ఒంటరి కాదు...
టీఎంఎస్‌ఆర్‌యూ సంయుక్త ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్రావు మాట్లాడుతూ తొలగింపునకు గురైన మెడికల్ రిప్రజెంటీటివ్లు ఒంటరి వారు కాదనీ, వారి వెనుక ఒక లక్ష మంది ఎఫ్ఆర్ఎంఏ సభ్యులు, 45 లక్షల మంది సీఐటీయూ సభ్యులున్నారని తెలిపారు. వెంటనే ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనీ, ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ మద్ధతు
సనోఫీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. ధర్నాకు హాజరైన ఆయన వారి పోరాటానికి సీఐటీయూ అండగా నిలుస్తుందని ప్రకటించారు.