Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
- ఉదయం 7 నుంచి సాయంత్రం 7వరకు
- కొవిడ్ ఉన్నవారికి సాయంత్రం 6 నుంచి అనుమతి
- బందోబస్తులో 3865మంది పోలీసులు, కేంద్ర బలగాలు
- ఐదు మండలాల్లో 306 పోలింగ్ కేంద్రాలు
- విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ.. డబ్బులు అందలేదని పలుచోట్ల ఆందోళనలు
- కండ్లఎదుటే నోట్లు పంచుతున్నా.. 'సీ-విజిల్'కు స్పందన కరువు
- ఇప్పటికీ అర్థం కాని ఓటరునాడి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రమంతటా ఉత్కంఠగా ఎదురుచూ స్తున్న హుజూరాబాద్ ఉప పోరులో చివరిఘట్టం పోలింగ్ నేడు జరగనుంది. కొవిడ్ నిబంధనల నడుమ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు పోలింగ్ ప్రక్రియకు సమయమిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. నియోజకవర్గంలోని 5మండలాల పరిధిలో 306 పోలింగ్ కేంద్రాలు, భద్రతా, బందోబస్తు కోసం 3865మంది పోలీసు, కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. వీవీప్యాడ్లు, ఈవీఎంలతో పోలింగ్ సిబ్బంది సిద్ధమయ్యారు. నియోజకవర్గమంతా పర్యవేక్షించేందుకు, పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రచారం ముగిన తరువాత డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచినా పోలీసు శాఖవారు తీసుకొచ్చిన 'సీ-విజిల్‌కు' స్పందన కరువైంది. ఏదేమైనా ఇప్పటికీ హుజూరాబాద్ ఓటర్ల నాడీ అర్థంకాక గెలుపు ఎవరిదనేది స్పష్టంగా చెప్పలేని స్థితిలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు.
భారీ బందోబస్తు
రెండ్రోజుల కిందటే ప్రకటించిన 72గంటల నిశ్శబ్ధకాల నిర్వహణ, నేడు జరగబోయే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతతకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ పోలీసు, కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. ఇద్దరు అడిషనల్ డీఎస్పీలు, 15మంది ఏసీపీలు,
65మంది సీఐలు, 180మంది ఎస్ఐలు, 2వేల మంది పోలీసు సిబ్బంది, 20 కంపెనీలకు చెందిన 1520 మంది కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో 174 ప్రత్యేక అధికారుల సమక్షంలో జిల్లాకు చెందిన 700 మంది, ఇతర జిల్లాల నుంచి 1471 మంది పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. మొత్తంగా అన్ని విభాగాలకు చెందిన పోలీసు, కేంద్రబలగాలు కలిపి 3865 మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పోలింగ్‌పై వెబ్‌కాస్టింగ్ కన్ను
హుజూరాబాద్ ఉప పోరు పోలింగ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా వెబ్‌కాస్టింగ్ ప్రక్రియనూ తీసుకొచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో అధికారుల పనితీరును పరిశీలించేందుకు దొంగ ఓట్లను నిలువరిచేందుకు.. రిగ్గింగ్ లాంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఈ ప్రక్రియను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్‌కాస్టింగ్‌లో బీఎస్ఎన్ఎల్(3జీ) నుంచి 38, బీఎస్ఎన్ఎల్ (ఎఫ్టీటీహెచ్) నుంచి 78, ఏయిర్టెల్ నుంచి 38, జియో నుంచి 152 నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసింది.
2,37,036మంది ఓటర్లు.. 306 పోలింగ్ కేంద్రాలు
నియోజకవర్గంలోని హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాల పరిధిలో 2లక్షల 37వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు లక్షా 17వేల 933 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ఇందులో సర్వీసు ఓటర్లు మహిళలు ఆరుగురు, పురుషులు 143మంది, ఎన్నారై ఓటర్లు 11మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. 306 కంట్రోల్ యూనిట్లలో బ్యాలెట్ యూనిట్లు 612, వీవీప్యాట్స్ 306 అందుబాటులో ఉంచారు. అదనంగా 115 కంట్రోల్ యూనిట్లు 279 బ్యాలెట్ యూనిట్లు, 209వీవీప్యాట్స్నూ తెప్పించారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటలవరకే సాగనుంది.