Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్‌ట్రిబ్యునల్ 'స్టే'పై రేవంత్ ఆవేదన
- అనుమతులిప్పించే బాధ్యత కిషన్‌రెడ్డి, సంజరుదే...
- ఉమ్మడి రాష్ట్రం కోసం కవలపిల్లల్లా కేసీఆర్, జగన్
- షర్మిల పాదయాత్ర... పేర్ని నాని వ్యాఖ్యలే నిదర్శనం
- టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపదు?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పర్యావరణ అనుమతులు లేవంటూ పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పాలమూరు ప్రాజెక్టులకు మరణశాసనం లిఖించిందని వ్యాఖ్యానించారు. ఈవిషయంలో సీఎంకేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తోనే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. దీంతో దక్షిణ తెలంగాణ శాశ్వత సమాధిగా మారబోతుందన్నారు. పది రోజుల్లో పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమ తుల ఇప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ బండి సంజరు మీద కూడా ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నాయ కులు మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, మెట్టుసాయి, మానాల మోహన్‌రెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం వారు ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుందనీ, వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడం, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమన్నారు. జలవివాదాలు సృష్టించి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కేటీఆర్ భీమవరంలో పోటీ చేస్తారో, లేక బొబ్బిలిలో పోటీ చేస్తారో తెల్వదు కానీ ఇలాంటి కుట్రలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు. జగన్ జైలుకు వెళ్తున్నాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేతో ప్రాజెక్టు పనులు ఆపితే జరిగిన ప్రాజెక్టు పనులు శిథిలమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. 2013 ఆగస్టులో కాంగ్రెస్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో నెంబర్ 72 ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని గుర్తు చేశారు. 2015 జూన్‌లో శంకుస్థాపన చేసిన కేసీఆర్ దాన్ని మూడేండ్లలో పూర్తి చేస్తానని చెప్పి, ఆతర్వాత పను లను విస్మరించారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్ధవంతమైన న్యాయవాదిని నియమించకపోవడంతో ఎన్జీటీలో ఓడిపోయామని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ రాక్షస క్రీడలో రాష్ట్రం ఓడిపోయిందన్నారు. కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం 2017లో పెట్టిన దరఖా స్తులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందనీ, ఎవరి ఒత్తిడికి తలొగ్గి దరఖాస్తును వెనక్కి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతులు లేని పట్టిసీమ ప్రాజెక్టుపై కోర్టు తీర్పు వచ్చేలోపే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పనులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. దాంతో ఆ ప్రాజెక్టును కూల్చలేమని ఎన్జీటీ చెప్పిందనీ, అందుకుగానూ జరిమాన వేసి వదిలేసిందని చెప్పారు. కష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఇదే సూత్రాన్ని కేసీఆర్ ఎందుకు అనుసరించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందనీ, అందుకే ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం కష్ణా నీటివివాదాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. తన కొడుకును సీఎం చేయడానికి వాస్తు పేరుతో కేసీఆర్ పాత సచివాలయాన్ని కూల్చి, కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని చెప్పారు. ట్యాంక్ బండ్ శిఖంలో కొత్త సచివాలయం నిర్మాణం చేయొద్దంటూ తాను నేషనల్ గ్రీన్బ్రిబ్యునల్, సుప్రీం కోర్టులో కేసువేస్తే, ప్రముఖన్యాయవాదికి కోట్లాది రూపాయలు చెల్లించి, వాదనలు వినిపించి, విజయం సాధించారని చెప్పారు. అలాంటిది పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఎందుకు న్యాయనిపుణుడిని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తీవ్రమైన దోపిడీకి పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌ను జూరాల కట్ట మీద, శ్రీశైలం గట్టు మీద ఉరి తీసిన, కల్వకుర్తి కట్ట కింద రాళ్లతో కొట్టి పాతరేసినా తప్పులేదని రేవంత్ విమర్శించారు.