Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ ఎదుట 48గంటల మహాధర్నా, వంటావార్పు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యల ను పరిష్కరించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ 48 గంటల మహాధర్నా, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సం దర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. జిల్లాలో పేరుకుపోయిన పెండింగ్ ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు జిల్లాలకు ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చడం తప్ప నేటికీ ఇన్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయలేకపోయారన్నారు. జిల్లాలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. దళితులకు నాలుగు గ్రామాల్లో మాత్రమే 36 మందికి మూడెకరాల భూమి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. భువనగిరి, చౌటుప్పల్ , పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం మండలాలను హెచ్ఎండీఏ పరిధి ఎత్తివేసి, దళితులకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలన్నారు. సీపీఐ(ఎం) చేసే ప్రజా పోరాటంలోకి ప్రజలు పెద్దఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఏర్పాటు అనంతరం ఐదేండ్ల కాలంలో ఏమాత్రం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్దమా అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ సవాల్ విసిరారు. ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, సాగు నీరు అందించే చిన్న నీటి వనరుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గంధమల్ల ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్న హామీ ప్రకారం.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.