Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి నుంచి నావైఖరి సమైక్యరాష్ట్రమే...
- రేవంత్ వైఖరేదైనా...ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే
- ఇష్టాగోష్టిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే చర్చ జరుగుతుందనీ, దానికి తాను మద్దతిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మొదటి నుంచి తాను సమైక్య రాష్ట్రాన్నే కోరుకున్నాననీ, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపి సమైక్య రాష్ట్రం చేస్తామంటే అభ్యంతరంలేదన్నారు. రేవంత్‌రెడ్డిది అధ్యక్షుడి హౌదాలో వైఖరేదైనా...ఇది మాత్రం తన వ్యక్తి అభిప్రాయమని చెప్పారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి ఇష్టాగోష్టిలో విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ ఫ్లీనరీలో రాజకీయంగా అయోమయానికి గురయ్యారని చెప్పారు. బీజేపీ ఎటు వీలైతే అటు మారే గోడమీద పిల్లిలాంటిదన్నారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటే, తనను తెలంగాణ ద్రోహిగా చిత్రికరించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆరే ప్రారంభించారనీ, అందులో ఎటువంటి అనుమానంలేదన్నారు. కాంగ్రెస్ ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నదని చెప్పారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు తప్పని పరిస్థితుల్లో మద్దతిచ్చాయని తెలిపారు. తెలంగాణలో షర్మిల అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారనీ, తర్వాత హైదరాబాద్‌లో పుట్టి పెరిగామనే కారణంతో టీడీపీ నేత నారా లోకేష్, జగన్ ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్ విజయం సాధిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.