Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ టెన్ ర్యాంకుల్లో ఏడుగురు వారే
- టాపర్లంతా ఎస్సీ,ఎస్టీ,బీసీలే
- బీపీఈడీ, డీపీఈడీలో 96.99 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్)-2021లో అమ్మాయిలు హవా కొనసాగించారు. రెండు విభాగాల్లోనూ వారు సత్తాచాటారు. బీపీఈడీలో టాప్‌టెన్ ర్యాంకుల్లో ఏడుగురు, డీపీఈడీ టాప్‌టెన్ ర్యాంకుల్లో ఏడుగురు వారే నిలవడం గమనార్హం. ఇంకోవైపు టాపర్లంతా ఎస్సీ,ఎస్టీ,బీసీకి చెందిన వారే ఉన్నారు. పీఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఈసెట్‌కు 5,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, గతనెల 23న జరిగిన పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. వారిలో 2,994 (96.99 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఇందులో బీపీఈడీకి 2,871 మంది దరఖాస్తు చేస్తే, 1,844 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 1,787 (96.91 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. డీపీఈడీకి 2,183 మంది దరఖాస్తు చేయగా, 1,243 మంది పరీక్ష రాశారని అన్నారు. వారిలో 1,207 (97.10 శాతం) మంది అర్హత పొందారని చెప్పారు. బీపీఈడీలో ఖమ్మం జిల్లాకు చెందిన అంగోతు కృష్ణవేణి (ఎస్టీ) ప్రథమ ర్యాంకులో నిలిచారు. నిర్మల్ జిల్లాకు చెందిన బడే రమేష్ (ఎస్సీ) రెండో ర్యాంకు పొందారు. బీపీఈడీలో టాప్ పది ర్యాంకుల్లో ఎస్సీలు నలుగురు, ఎస్టీలు ముగ్గురు, బీసీలు ముగ్గురు ఉన్నారు. డీపీఈడీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజుల సృజన్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో ర్యాంకును తుంగ అనూష సాధించారు. ఇందులో టాప్‌టెన్ ర్యాంకుల్లో ఎస్సీలు ఒకటి, ఎస్టీలు నాలుగు, బీసీలు ఐదు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ కాలేజీలకు విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని వివరించారు. గతేడాది బీపీఈడీలో 1,300 సీట్లు, డీపీఈడీలో 350 సీట్లున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ గోపాల్‌రెడ్డి, పీఈసెట్ మాజీ కన్వీనర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఈసెట్ ఉత్తీర్ణత వివరాలు
కోర్సు దరఖాస్తు హాజరు ఉత్తీర్ణత శాతం
బీపీఈడీ 2,871 1,844 1,787 96.91
డీపీఈడీ 2,183 1,243 1,207 97.10
మొత్తం 5,054 3,087 2,994 96.99