Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటిఉదయంలోగా రిపోర్టు చేయండి
- ప్రయివేటు అధ్యాపకులకు ఇంటర్ బోర్డు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అధ్యాపకులను పంపించని యాజమాన్యాలపైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయంలోగా అధ్యాపకులు రిపోర్టు చేయాలని ఆదేశించారు. చేయకపోతే అవసరమైన క్రమశిక్షణ, శిక్షార్హమైన చర్యలను వెంటనే తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల ఆరు నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అనుభవం ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగం, ప్రయివేటు కాలేజీల నుంచి జూనియర్ లెక్చరర్లను మూల్యాంకన విధుల కోసం నియమించామని పేర్కొన్నారు. ఇందుకను గుణంగా వారిని విధులకు పంపించాలని కాలేజీలకు ఆదేశాలిచ్చామని వివరించారు.లకొంతమంది జూనియర్ లెక్చరర్లు ఇప్పటి వరకు స్పాట్ వాల్యు యేషన్ విధులకు హాజరు కాలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రిపోర్టు చేయని జూనియర్ లెక్చరర్లు, రిలీవ్ చేయని కాలేజీ యాజమాన్యాలకు డిఫాల్టర్ జూనియర్ లెక్చరర్లు, మేనేజ్మెంట్లపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
స్పాట్ కేంద్రాల వద్ద నిరసన
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కేంద్రాల వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం (టిగ్లా) ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా మూల్యాంకనం కేంద్రాన్ని సందర్శించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ను టిగ్లా అధ్యక్షులు ఎం జంగయ్య కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులను మూల్యాంకనంలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. రోజూ ఏఈలకు 30 పేపర్లు మాత్రమే వాల్యుయేషన్ చేయాలని కోరారు. క్యాంపు సమయాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించాలని సూచించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిగ్లా ఉపాధ్యక్షులు లక్క స్వామి, లక్ష్మయ్య, చంద్రయ్య, నాయకులు రమణకుమారి, దుర్గాప్రసాద్, మాన్యానాయక్, మంజునారు, సైదులు, పరుశురాములు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు భోజన విరామ సమయంలో ధర్నా
ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, వేములు శేఖర్, నగేశ్, రహీం, గాదె వెంకన్న, సమన్వయకర్త ఎం జంగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.