Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డిలో గర్భిణీకి వ్యాక్సిన్ వేయడంతో శిశువు మృతి: బంధువులు
- డ్యూటీ చేయాలంటే భయంగా ఉంది : ఏఎన్ఎం
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్/సదాశివనగర్
కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన ఏఎన్ఎంపై పలువురు గిరిజనులు దాడి చేశారు. గర్భిణీకి కోవిడ్ రెండో డోసు టీకా వేయడంతో శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ దాడి చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఉత్నూర్ పీహెచ్సీలో రెండో ఏఎన్ఎంగా సావిత్రి విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఇంటింటికీ తిరిగి టీకాలు వేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని గాంధారి మండలం రాంపూర్గడ్డకు చెందిన గర్భిణీ వడ్డె శ్రీలత మొదటి డోసు తీసుకోగా ఈ నెల 1వ తేదీన రెండో డోస్ టీకా వేశారు. రెండో తేదీన పురిటి నొప్పులు రావడంతో గాంధారి ఆస్పత్రికి తరలించగా డెలివరీ చేసి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. శిశువు కండీషన్ సీరియస్గా ఉందని చెప్పడంతో వైద్యుల సూచన మేరకు నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 4వ తేదీన శిశువు మృతిచెందింది. ఈ క్రమంలో విధులు ముగించుకొని బస్సు కోసం ఎదురుచూస్తున్న ఏఎన్ఎంపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
విధులకు వెళ్లాలంటే భయంగా ఉంది : ఏఎన్ఎం
11 ఏండ్లుగా రెండో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాననీ, ఉన్నతాధి కారుల సూచనల మేరకు వ్యాక్సినేషన్ చేపడుతున్న తమపై దాడులు చేస్తుంటే విధులకు వెళ్లాలంటే భయంగా ఉందని ఏఎన్ఎం సావిత్రి వాపోయారు. దాడి ఘటనను నిరసిస్తూ ఏఎన్ఎంలు బుధవారం రాత్రి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ శ్రీలత 7వ నెలలో ముందస్తుగా డెలివరీ కావడంతో శిశువు కండీషన్ సీరియస్గా ఉందనీ, బతకడం కష్టమని వైద్యులు సైతం కుటుంబీకులకు చెప్పినట్టు తెలిపారు. 4వ తేదీన పాప మృతిచెం దడంతో అప్పటి నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆమె కంటతడి పెట్టారు. ఆ గ్రామ సర్పంచ్, పెద్దలు వారికి సర్ధిచెప్పినా తనకు ఫోన్ చేసి వేధింపు లకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేస్తుంటే విధులకు వెళ్లాలంటే భయం వేస్తోందనీ, తండాలకు వెళ్తే ఫోన్లకు సిగల్ ఉండదనీ, తమకు ఏమన్నా జరిగితే ఎలా అని వాపోయారు. తన సంపాదన మీదనే కుటుంబం ఆధారపడ్డదనీ, తనకు జరగరానిది జరిగితే ఎలా అని వాపోయారు.