Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఓ 60 వెంటనే అమలు చేయాలి
- పెంచిన వేతనాలను అమలు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య
నవతెలంగాణ-గండిపేట్/పెద్దపల్లి
మున్సిపల్ కార్మికుల పట్ల మానవత్వం చూపని కేసీఆర్ సర్కారుపై పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్మికులు నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో వీరయ్య పాల్గొని మాట్లాడారు. కార్మికుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపడం దారుణమన్నారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 60ని అమలు చేయకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కొన్ని కార్పొరేషన్లల్లో జీఓను అమలు చేస్తూ కార్మికులందరికి పెంచిన వేతాలిస్తున్నట్టు గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన కార్మికులకు న్యాయం చేయాలన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సినల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం ఉన్న వేతనంపైన 30శాతం పెంచుతూ గత జూన్లో ప్రభుత్వ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకొని మున్సిపల్ బాడీలో తీర్మానం చేసి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.