Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగిలో వరి ధాన్యాన్ని కొనకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులే ఉరేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. వరి పంట వేయొద్దనీ, అది వేస్తే రైతులకు ఉరే అవుతుందనీ, ఎట్టిపరిస్థితుల్లో ఆ ధాన్యాన్ని కొనేది లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడం సరైంది కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వానాకాలం వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆయన డిమాండ్ చేశారు. వరి వేయొద్దనీ, కొనొద్దనీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించకుండా, పోరాటం చేయకుండా రైతులు ఆ పంట వేయొద్దంటూ చెప్పడం ఆయన చేతగానితనాన్ని తెలియజేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కేంద్రం విధానంపై మాట్లాడకుండా వరి ధాన్యం కొనకుంటే యుద్ధం చేస్తామంటూ రెండు నాల్కల ధోరణితో శిఖండి పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కొంటామనీ, ఫలితాలు వచ్చాక కేంద్ర సర్క్యులర్‌ను చూపించి రైతులు వరివేయొద్దని సీఎం మాట్లాడ్డం స్వార్ధబుద్ధిని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే వానాకాలం ధాన్యాన్ని రైతులు కళ్లాలు, ఐకేపీ కేంద్రాల్లో కుప్పలు పోసి రేయింబవళ్లు కాపలా కాస్తూ నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరి వేసే పంట భూముల్లో వేరే పంట వేయడానికి వీల్లేదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మతిలేని ప్రకటనల వల్ల అవి వృధాగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టుకున్నది వరి వేయకుండా ఉండటానికేనా?అని రైతులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి పండే భూముల్లో ఆ పంటను పండించడానికి అనుమతించాలని కోరారు. నూతన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనీ, జాతీయంగా, అంతర్జాతీయంగా అన్నార్తుల ఆకలిని తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.