Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించిన సీపీఐ(ఎం) ముద్దుబిడ్డలు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు, అమరజీవులు కామ్రేడ్ కుంజా బొజ్జి, కామ్రేడ్ సున్నం రాజయ్యల స్మారక స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం గురువారం భద్రాచలంలో నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర నాయకులుగా, మూడు దఫాలుగా భద్రాచలం శాసనసభ్యులుగా.. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, నికార్సయిన కమ్యూనిస్టులుగా వారు చివరి వరకూ నిలబడి పని చేశారు. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యాన్ని స్మరించుకునేందుకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో స్మారకస్థూపం ఆవిష్కరణ కార్యక్రమం, అనంతరం మార్కెట్ యార్డ్‌లో సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందా కారత్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథులుగా సీపీఐ(ఎం) ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి.మధులు హాజరుకానున్నారు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు, పోతినేని సుదర్శన్‌రావు, ఎం.సాయిబాబు హాజరుకానున్నారు.