Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీ మేరకు 30 శాతం పీఆర్సీ అమలు చేయాలి
- వారానికో సెలవు అమలు చేయాలి: మహాపాదయాత్రలో ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
ఆశా కార్మికులకు పక్క రాష్ట్రం ఆంధ్రాలో చెల్లిస్తున్నట్టు రూ.10 వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి డిమాండ్ చేశారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి రామారెడ్డి రోడ్డు మీదుగా నూతన కలెక్టరేట్ వరకు పది కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు జాబ్‌చార్ట్ లేకుండా ప్రభుత్వం అన్ని పనులూ చేయించుకుంటుందని విమర్శించారు. పనిభారంతో పనిచేస్తున్న వీరిపై అధికారులు వేధింపులకు పాల్పడుతుండటంతో ఆశాలు మరింత ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఆశాలకు వారానికి ఒక రోజు సెలవు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనిఒత్తిడి తగ్గించి, కనీస వేతనం అమలు చేయాలనీ, లేకుంటే చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని స్పష్టంచేశారు. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌వో కల్పనకంటేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశాల సమస్యలను ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రాజనర్సు, ఎల్లయ్య, సంతోష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మమత, రజిత, వందలాదిమంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.