Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాలకు కోటీ రూపాయల చొప్పున నష్ట పరిహారమివ్వాలి
- ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగానే శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పి-3 మైన్లో బండకూలిపోయి నలుగురు కార్మికులు చనిపోయారనీ, ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారమివ్వాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, ఉన్నతాధికారులు ఉత్పత్తే లక్ష్యంగా పని చేస్తూ కార్మికుల భద్రతను గాలికోదిలే శారని విమర్శించారు. ఫలితంగానే సింగరేణిలో తరుచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నారని వాపోయారు. స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ మైన్ సేఫ్టీ లో తీసుకున్న నిర్ణయాలను కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదని విమర్శించారు. మైన్స్ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన సేఫ్టీ కమిటీలను అనుచరగణంతో నింపుకుని తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహిస్తున్నారనీ, ఫలితంగా సరైన చర్చ జరగడం లేదని పేర్కొన్నారు. మోడీ విధానాల వల్ల మైన్ సేఫ్టీని పర్యవేక్షించాల్సిన డీజీఎంఎస్ ఆఫీస్ అలంకారప్రాయంగా మారిందని విమర్శించారు. సింగరేణిలో ప్రమాదాలు నివారించేందుకు అన్ని యూనియన్ల నేతలతో, అనుభవజ్ఞులైన అధికారులతో కమిటీలు వేయాలనీ, కార్మికుల భద్రతపై అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.