Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగిలోనూ ధాన్యాన్ని కొనాలి : రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
డిమాండ్, సప్లరు ఆధారంగా పంటల విధానాన్ని రూపొందించాలని రౌండ్‌టేబుల్ పలువురు వక్తలు సూచించారు. పంటల మార్పిడి, మార్కెట్ తదితర అంశాలపై రైతుల్లో సరైన అవగాహన కల్పించాలనీ, ఆతర్వాతనే పంటల మార్పిడి విధానాన్ని తీసుకురావాలని సూచించారు. వచ్చే యాసంగిలోనైనా కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'వరి ధాన్యం కొనుగోలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయదారుల పరిస్థితి దయనీయంగా తయారైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు చెరుకు పంట వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వ నిజాం షుగర్స్ ప్యాక్టరీని ప్రారంభించడంలేదని విమర్శించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని చెప్పారు. యాసంగి వరి పంట మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.ఏఐకేఎంఎస్ ఉపాధ్యక్షులు చలపతి రావు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలతోనే వ్యవసాయ రంగం పై అనేక అంశాలు చర్చకు వచ్చాయన్నారు. రైతులను కాంట్రాక్టు వ్యవసాయం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన వరి ధాన్యానికీ, ముడి బియ్యానికి సంబంధంలేదనీ, కొనుగోలు చేశాక వాటిని ఏవిధంగా మార్చుకోవాలనేది ఆయా ప్రభుత్వాల ఇష్టమని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ కోణంలో కాకుండా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని పేర్కొన్నారు. వరిపై కేంద్రం అస్పష్టమైన వైఖరి అవలంభిస్తున్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యాసంగి వడ్లను కేంద్రం కొంటుందని చెప్పారు. అయితే ఎంత అవసరమో అంతే కొంటామని చెప్పిందని గుర్తు చేశారు. ఉప్పుడు బియ్యం కొనమంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపునకు మళ్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జగపతిరావు, రవీంద్ర బాబు, రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, టీడీపీ నేత శేఖర్‌రెడ్డి, వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి వేణుగోపాల్ రెడ్డి, సాదిక్ తదితరులు మాట్లాడారు.