Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్పీ3లో నలుగురు కార్మికుల మృతి
- ఒక మృతదేహం వెలికితీత
- కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్మిక సంఘాల ఆందోళన
నవతెలంగాణ-నస్పూర్
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ఆర్పి-3 గనిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. బుధవారం గనిలో ఉదయం షిఫ్ట్‌లో బేర లక్ష్మయ్య(60), వి. క్రిష్ణారెడ్డి(58), గడ్డం సత్యనర్సింహారాజు(32), రెంక చంద్రశేఖర్ (32) కలిసి 21వ డిప్ 24వ లెవల్ వద్ద రూఫ్ బోల్టింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పైకప్పు నుంచి బండ కూలడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిన వెంటనే గని అధికారులు రెస్క్యూ టీంను పిలిపించి మృతదేహాలను వెలికితీసే పనులు చేపట్టారు. రెంక చంద్రశేఖర్ మృతదేహాన్ని గని నుంచి వెలుపలికి తీసుకొచ్చారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని చూసి కార్మికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వీ వాంట్ జస్టిస్, యాజమాన్యం విధానాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైటాయించారు. వీరికి కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అధిక బొగ్గు ఉత్పత్తి పేరిట అధికారులు కార్మికులపై ఒత్తిడి పెంచి ప్రాణం బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా మూడు మృతదేహాలను తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే కార్మికుల కుటుంబ సభ్యులు, సమీపంలో కాలనీవాసులు, మాజీ కార్మికులు వెంటనే చేరుకున్నారు. కన్నీరుమున్నీరయ్యారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే.. : కార్మిక సంఘాలు
అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచూ గనిలో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాడ్ రూఫ్ అని తెలిసినా కూడా వృద్ధులను, ఏమాత్రమూ అనుభవం లేని యువకులను గనిలోకి పంపారని, పర్యవేక్షణ అధికారులు కూడా లేరని నాయకులు అన్నారు. ప్రమాదానికి ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. రెగ్యులర్‌గా జరగాల్సిన సేఫ్టీ కమిటీలు తుతూ మంత్రంగా జరుగుతున్నాయన్నారు. సేఫ్టీ, మైన్స్ కమిటీల్లో అనుభవం ఉన్న సీనియర్ కార్మికులను తీసుకోకపోవడం మూలంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీఎన్టీయూసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి టీబీజీకేఎస్ నాయకులను నిలదీశారు. యాజమాన్యంతో మాట్లాడి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో టీబీజీకేఎస్ నాయకులు.. యాజమాన్యంతో మాట్లాడి చనిపోయిన వారికి బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతులు నంనూర్‌కు చెందిన బేర లక్ష్మయ్య(టింబర్ మెన్)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే8 కాలనీకి చెందిన వి.కృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెంక చంద్రశేఖర్‌కు భార్య, బాబు(నెల) ఉన్నారు. ఇల్లందుకు చెందిన గడ్డం నరసింహారాజు(బదిలీ వర్కర్) ఇంకా పెండ్లి కాలేదు. ప్రమాదం నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించింది.