Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నా చౌక్ ఉండాల్సిందే
- ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమైక్య రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులకు ఉన్న స్వేచ్ఛ నేడు సొంత రాష్ట్రంలో లేకుండా పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యేగా ఆయన ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఓయూ జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖను స్పీకర్ తీసుకోకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. స్పీకర్, చట్టాలున్నప్పటికీ సీఎం చెప్పిందే నడుస్తున్నదన్నారు. మీడియాపాయింట్ వద్ద మాజీ సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ఎల్లకాలం కొనసాగదనీ, స్వేచ్ఛకోరుకునేవారంతా కేసీఆర్ చెంపచెళ్లుమనిపించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే పోయేదేమీ లేదంటున్న వాళ్లు రూ.600 కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ ద్రోహులను దగ్గరకు తీసుకుని నిజమైన ఉద్యమకారులపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శిం చారు. ధర్నాచౌక్‌ను ఎత్తేయాలనే నియంతృత్వ చర్యలకు పూనుకున్న కేసీఆర్‌కు నేడు అది కావాల్సి వచ్చిందన్నారు. ధర్నాచౌక్ ఉండాలనీ, అ వేదిక నుంచి ప్రజాసమస్యలపై గొంతులు వినపడాలని ఆకాంక్షించారు. రైతు వేదికలు పశువుల దొడ్లలా మారిపోయాయన్నారు. ఓసారి వరి వేయొద్దంటడు.. మరోసారి పత్తి వేయవద్దంటడు..ఇంకోసారి సన్నాలు వేయొద్దంటడు.. మరి ఏ పంటలేయాలని ప్రశ్నించారు. వరి ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని హామీనిచ్చారు. మూడేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదనీ, ఏడేండ్లలో ఒక్క గ్రూపు వన్ పరీక్షను కూడా నిర్వహించలేదని విమర్శించారు. లక్షా 91 వేల ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న తలపెట్టిన నిరుద్యోగ మిలియన్‌మార్చ్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే హరీశ్‌రావు ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు.