Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలు, పోళ్లు పేరుతో రైస్‌మిల్లర్ల మోసం
- దోపిడీకి కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
- రోడ్డుపై బైటాయించి పెద్దఎత్తున రైతుల ఆందోళన
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
వడ్ల కొనుగోళ్లలో తీవ్ర మోసం చేస్తున్నారని.. పెట్రోల్ పోసుకొని చస్తాం కానీ ఈ నష్టాన్ని భరించలేమని రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్లు అధిక కోత విధిస్తూ మోసానికి పాల్పడుతున్నారని.. ఈ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై బుధవారం రైతులు పెద్దఎత్తున బైటాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని నిర్వాహకులు ధృవీకరించిన తర్వాత కూడా రైస్‌మిల్లర్లు అధిక కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకొస్తే ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అధిక మొత్తంలో కోత విధించడంతో చివరికి రైతుకు అప్పులే మిగులుతున్నాయి తప్ప రూపాయి చేతికి రావడం లేదని వాపోయారు. నిర్వాహకులు, ఐకేపీ అధికారి ధ్రువీకరించిన తర్వాతే తూకం వేసి రైస్ మిల్లులకు పంపించినట్టు తెలిపారు. రైస్ మిల్లర్ల నిర్వాహకులు లారీకి కనీసం ఎనిమిది క్వింటాళ్ల వడ్లను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాలు, పొల్లు, తడి ఉన్నాయంటూ రైస్ మిల్లర్ల యజమానులు వ్యవహరిస్తున్నారన్నారు. రైస్ మిల్లర్లు కోత విధిస్తున్నారని ఐకేపీ సెంటర్ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే.. రైతులు అందరు కలిసి కోతను భరిస్తామని చెప్పడంతోనే తూకం వేసినట్టు చెబుతున్నారని విమర్శించారు. రైతుల కన్నీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. రైస్ మిల్లర్ల దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. పండించిన పంటలో కనీసం 10 నుంచి 15 బస్తాలు ఒక రైతుకు కోత విధిస్తున్నారని తెలిపారు.