Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు ఉక్కుపాదం.. నేడు అక్కడే నిరసన గళం...
- 2017లో ఎత్తేసేందుకు టీఆర్ఎస్ సర్కారు ఆదేశాలు
- ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ పోరాటంతో దక్కిన వైనం
- ధాన్యం కొనుగోళ్లపై రేపు అదే వేదికపై గులాబీ పార్టీ ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మిమ్మల్ని, మీ విధానాల్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటారా..? నిలదీస్తే రకరకాల ముద్రలేస్తారా...' సరిగ్గా నాలుగు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వా న్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. అయితే ఇదే టీఆర్ఎస్ సర్కారు... ఇప్పటి బీజేపీ తరహాలోనే 2017లో 'ప్రశ్నించే గళాలకు' వేదికైన ధర్నాచౌక్‌ను ఎత్తేసింది. ఎవరెన్ని చెప్పినా లెక్కచేయక దాని మూసివేతకు రంగం సిద్ధం చేసింది. ఆ యేడాది మార్చి ఎనిమిదోతారీఖున, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 'ధర్నాచౌక్' మూసి వేతకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెండు నెలలకు పైగా చేసిన పోరాట ఫలితంగా తిరిగి దాన్ని దక్కించుకోగలిగారు. ఆనాడు ధర్నాల్లేవు.. గిర్నాల్లేవంటూ ధర్నాచౌక్‌ను ఎత్తేయటానికి ప్రయ త్నించి, విఫలమైన టీఆర్ఎస్ సర్కారు నేడు అదే వేది కగా ధాన్యంకొనుగోళ్లపై ఆందోళనకుశ్రీకారం చుట్టబో తుండటంగమనార్హం. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నాచౌక్ అనేది ప్రజాస్వామ్య ఆకాంక్షల వ్యక్తీకరణకు వేదిక. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక సంస్థలు, వ్యక్తులు, శక్తులు... తమ తమ డిమాండ్లు, కోర్కెల సాధన కోసం ఈ వేదికను ఆశ్రయించిన సందర్భాలు కోకొల్లలు. అసెంబ్లీ సమా వేశాలు జరిగిన ప్రతీసారి.. దానికి సమాంతర వ్యవ స్థగా ప్రజాసమస్యలపై అనేక నిరసనగళాలు ధర్నా చౌక్లోవినబడేవి. ప్రతిపక్షాలకుచెందిన శాసనసభా పక్ష నేతలు ప్రజల పక్షాన ఇక్కడి నుంచి ఎన్నోసార్లు ప్రసంగించటం ద్వారా పాలకపక్షాలకు హెచ్చరికలు పంపారు. తద్వారా కార్మికులు, కర్షకులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల వారిసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. అయితే 'తెలంగాణ వస్తే ధర్నాలే ఉండబోవు' అని ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు 2017 మార్చి 8న ఏకంగా ధర్నాచౌక్‌నే ఎత్తేయాలం టూ మౌఖిక ఆదేశా లు జారీచేసింది. ఈక్రమంలో ఉద్యమ గొంతుకలకు వేదికైన ఆధర్నాచౌక్ను రక్షించుకునేందుకు సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి కన్వీనర్‌గా, విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు కో కన్వీనర్‌గా 'ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ' ఏర్పాటైంది. సీపీఐ (ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యు), ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యుసీఐ (సీ)తోపాటు పలు మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు, సామాజిక వేత్తలు భాగస్వాముల య్యారు. ప్రభుత్వం ఏ ధర్నాలనైతే నిషేధించిందో.. అదే ధర్నాలను ఆయుధంగా చేసుకుని 2017 ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు వివిధ రూపాల్లో, దశల్లో ఆందోళనలను నిర్వహించారు. చివరకు ప్రభుత్వం, పోలీసుల చర్యలన్నింటినీ ధీటుగా ఎదుర్కొని మే 15న 'ధర్నాచౌక్'ను ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో గతంలో హైదరాబాద్‌లో అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేయాలనుకున్న ధర్నా చౌక్‌లోనే ఇప్పుడు గులాబీ పార్టీ నేతలు ఆందోళన చేపట్టబోవటం గమనార్హం.