Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం విషయంలో రైతులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టొదు
- దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘాల సమాఖ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉప్పుడు బియ్యం, ముడి బియ్యంతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందని దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘాల సమాఖ్య విమర్శించింది. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాఖ్య అధ్యక్షులు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు కూర్చుని చర్చించకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేఎశారు. ధాన్యం ప్రతి గింజా కొంటామంటూనే తగిన ఏర్పాట్లు చేయకుండా అన్నదాతలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో గన్నీ సంచులు, హమాలీల కొరత, రవాణా, గోదాముల కొరత లాంటి సమస్యలు వేధిస్తున్నాయనీ, బియ్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేయొద్దని కోరారు. ఇతర రాష్ట్రాల్లో వినియోగం లేదనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోకపోవటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అనుమతిస్తే తామే విదేశాలకు ఎగుమతి చేసుకుంటామని చెప్పారు. రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించే వ్యవస్థ కావాలంటూనే, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను కొనసాగించాలని కూడా కొనసాగాలని కోరారు. వీటితో పాటు అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించి రైతుల సంక్షేమం, వినియోగదారులకు లాభం చేకూరే కోణంలో కేంద్రం ఆలోచన చేయాలని దేవేందర్ విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా కిలోకు రూ.29 చొప్పున నగదును ఇస్తే ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తే దాన్ని దోశల పిండిగా మార్చుకునే పరిస్థితి ఉందని అన్నారు. వరి పంటల సాగు సమయంలోనే మద్ధతు ధరలను ప్రకటించాలని సూచించారు. సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు సత్యనారాయణ (కోదాడ), బాలయ్య, బూరే శ్రీనివాస్, సతీష్ పాల్గొన్నారు.