Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్లో 659 మంది ఉద్యోగ విరమణ
- 2023 నాటికి 8వేల మంది రిటైర్మెంట్
- బెనిఫిట్స్ చెల్లింపునకు కావల్సింది రూ.2,400 కోట్లు
- వయోపరిమితి 60 నుంచి 61 ఏండ్లకు పెంచే యోచన
- ఎస్ఎస్ఆర్ శాస్త్రి
ఆర్థికంగా ఇప్పటికీ ముక్కుతూ, మూలుగుతూ నిదానంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొత్త కష్టం వచ్చి పడింది. వచ్చే నెలాఖరుకు (డిసెంబర్) సంస్థ నుంచి 659మంది ఉద్యోగులు ఒకేసారిరిటైర్మెంట్ కానున్నారు. నెలవారీ ఖర్చు కాకుండా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు దాదాపు రూ. 200 కోట్లు అవసరం. అలాగే 2023 డిసెంబర్ నాటికి సంస్థ నుంచి ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించాలంటే సంస్థకు దాదాపు రూ.2,400 కోట్ల నగదు అదనంగా అవసరం. ఇప్పటికే అనేక ఢక్కాముక్కీలు తింటున్న ఆర్టీసీకి తాజా సంకటం మరిన్ని ఆర్థిక కష్టాల్ని తెచ్చి పెడుతున్నది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.10కోట్లు నుంచి రూ. 11.50 కోట్ల వరకు వస్తున్నది.
పెండ్లిండ్ల సీజన్ కావడంతో ఆదాయం పెరిగినట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి డిసెంబర్లో రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులంతా 2019లో ఉద్యోగ విరమణ చేయాల్సిన వారు. అప్పట్లో రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏండ్ల నుంచి 60 సంవత్సరాలకు పెంచ డంతో రెండేండ్లు ఆలస్యంగా ఈ ఏడాది డిసెంబర్లో ఉద్యోగవిరమణ చేస్తున్నారు. అయితే యూనియన్ బ్యాంక్ నుంచి రూ.130 కోట్ల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ ఇస్తున్నా, దాన్ని ఇప్పటికే వినియోగించుకుం టున్నారు. కాబట్టి అది అక్కరకు వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. అలాగే ఉద్యోగుల ప్రాఫిడెంట్ పండ్ సొమ్మును యాజమాన్యం 2019 డిసెం బర్ నుంచి కట్టట్లేదు. వారి వ్యక్తిగత ఖాతాల్లో బుక్ అడ్జెస్ట్మెంట్ చేసినప్పటికీ, పీఎఫ్ కార్యాలయానికి ఇప్పటి వరకు సొమ్ము జమచేయలేదు. దాదాపు రూ.1,300 కోట్ల పీఎఫ్ సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఎంప్లాయీ పెన్షన్ స్కీం (ఈపీఎస్)కు నెలకు రూ.6.5 కోట్లు చొప్పున 18 నెలల సొమ్మును చెల్లించాల్సి ఉంది. దీనిపై పీఎఫ్ కార్యాలయం ఆర్టీసీ యాజమా న్యానికి నోటీసులు ఇవ్వడంతో ఇటీవల తీసుకున్న రూ.500 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ బ్యాంకు రుణం నుంచి రూ.106 కోట్లు కట్టినట్టు సమాచారం. మిగిలిన సొమ్మును ఇంకా చెల్లించలేదు. రిటైర్మెంట్ అయ్యాక గ్రాట్యుటీ, పీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బెనిఫిట్స్‌ను కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే రెండేండ్లలో (2023 నాటికి) ఒకేసారి దాదాపు 8వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే, వారికి దాదాపు రూ.2,400 కోట్ల మేర ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అప్పటికప్పుడు అందించాల్సి ఉంటుంది. ఇంత సొమ్మును ఎక్కడి నుంచి తేవాలనేదే ప్రస్తుతం సంస్థ ముందున్న అతిపెద్ద సవాలు. ఆర్టీసీ చార్జీలను పెంచినా, ఆ సొమ్ము డీజిల్ భారాల అడ్జెస్ట్‌మెంట్‌కు సరిపోతుందే తప్ప, మిగులు ఉండదని అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. వచ్చే నెలలో (డిసెంబర్)లో రిటైర్ అయ్యే వారిలో ఆరుగురు అధికారులు, 36 మంది సూపర్వైజర్లు, 251 మంది డ్రైవర్లు, 132 మంది కండక్టర్లు, 98 మంది గ్యారేజీ సిబ్బంది, 136 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్లలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఈ ఆర్థిక ముప్పు నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 60 ఏండ్ల రిటైర్మెంట్ వయస్సును 61 ఏండ్లకు పెంచితే మరో ఏడాదికి ఈ ముప్పును పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. అయితే అప్పటికి సంస్థపై ఆర్థికభారం మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే గడచిన రెండేండ్లలో వివిధ కారణాలతో మరణించిన దాదాపు వెయ్యిమంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటికీ ఫైనల్ సెటిల్మెంట్లు చేయలేదు. దీనిపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. కనీస మానవతా దృక్పధాన్ని చూపాలని ఆ కుటుంబాల సభ్యులు, కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని కోరుతున్నాయి. ఈ దశలో రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనీ, ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసే యోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్టు సమాచారం. అలా కాకుండా యథాతధంగా ఉద్యోగ విరమణలు జరిగితే 60 ఏండ్ల వయసులో బెనిఫిట్స్ కోసం తామెక్కడ తిరగాలో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.