Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా మహమ్మారి కట్టడి కోసం పని చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులను తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని ఉత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం సావిత్రిపై దాడి చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండేండ్ల నుంచి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, సెలవులు తీసుకోకుండా, రాత్రింబవళ్లు పని చేస్తున్న సిబ్బందిపై దాడులు చేయటం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారమే సిబ్బంది పనిచేస్తున్నారనీ, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మహిళలని కూడా చూడకుండా భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. క్షేత్రస్థాయిలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ, సిబ్బందికి రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలన్నారు.