Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అప్రజాస్వామికంగా ధర్నాచౌక్ ఎత్తేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు అదే దిక్కైందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. రైతు సంక్షేమం పట్ల సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా...సాగు చట్టాలను రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గురు వారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ధర్నా చౌక్ ఎత్తేస్తే కోర్టులో తాను పిటిషన్ వేశాననీ, విచారించిన తర్వాతనే దాన్ని పునరుద్ధరించిందని గుర్తు చేశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్లో ప్రజల గోడు వినేందుకు సీఎం తగిన అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
పోరాటాల ఫలితమే : ముత్తినేని వీరయ్య
సంఘాల పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు వయో పరిమితి పదేండ్లకు పెంచిందని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. నిరుద్యోగ వికలాంగులకు వయోపరిమితి గడువు మే31తో ముగిసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడువు ముగిసిన ఆ జీవోను పొడిగించకపోతే వారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఆయా సంఘాలు ఉద్యమాలు చేయడంతో సర్కారు దిగొచ్చిందని తెలిపారు. వయో పరిమితి పొడిగిస్తూ జీవో ఇవ్వకపోతే వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఆయన వివరించారు.