Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి ఎమ్మెల్సీ పల్లా సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ నేతలు కనీస ప్రాథమిక అవగాహన లేకుండా ధర్నాలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతుల పట్ల రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే... ఇక్కడ కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. బుధవారం వరకూ రాష్ట్రంలో 3,550 కొనుగోలు కేంద్రాలను తెరిచామనీ, అన్ని చోట్లా ధాన్యాన్ని కొంటున్నామని వివరించారు. రైతులకు డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తున్నామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తేయలేదనీ, అక్కడి ప్రజలే దాన్ని వద్దన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ధర్నాలు చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని పల్లా సమర్థించుకున్నారు. సీఎం కేసీఆర్ ధర్నాలు చేయాల్సి వస్తే... ఇక్కడ కాదు, ఢిల్లీలో చేస్తారని చెప్పారు.
నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'ధాన్యం' ధర్నాలు
రాష్ట్రంలోని ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యాన శుక్రవారం ధర్నాలు చేపట్టనున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ తదితరులు పాల్గొంటారు.
మూడేండ్ల తర్వాత 'అక్కడ' హరీశ్ ప్రెస్‌మీట్...
రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో తన్నీరు హరీశ్‌రావు... మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆయన...టీఆర్ఎస్కు సంబంధించిన అనేక అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ... ఈ మధ్య కాలంలో అక్కడ ఎప్పుడూ ప్రెస్‌మీట్ నిర్వహించలేదు. అయితే సీఎం కేసీఆర్, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఇప్పటి వరకూ విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు మూడేండ్ల తర్వాత ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించటం చర్చనీయాంశమైంది.