Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సివిల్ సర్వీసెస్ సాధించడమే బీఏ హానర్స్ కోర్సు ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఈ కోర్సు చదివేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేదనీ, ఓయూ పరిధిలో నాలుగు కాలేజీల్లో అందుబాటులో ఉందని వివరించారు. బీఏ హానర్స్ కోర్సుకు సంబంధించిన పాఠ్యప్రణాళికను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలోని పలు విశ్వవిద్యాలయాల పరిధిలో బీఏ హానర్స్ కోర్సు అందుబాటులో ఉందన్నారు. అజీంప్రేమ్‌జీ, అశోకా, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సు ఉందని చెప్పారు. గతంలో తెలంగాణ విద్యార్థులు ఆ కోర్సును చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తుండేవారని గుర్తు చేశారు. ఇక నుంచి ఆ అవసరం లేదన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఓయూ పరిధిలో నిజాం, కోఠి మహిళా, సిటీ, బేగంపేట మహిళా కాలేజీల్లో బీఏ హానర్స్ (ఎకనామిక్స్), బీఏ హానర్స్ (పొలిటికల్ సైన్స్) కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హెచ్‌సీయూ, ఓయూ, కేయూ ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు కలిసి సిలబస్‌ను రూపొందించారని చెప్పారు. విద్యార్థులు ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంద న్నారు. ప్రత్యేకంగా మూల్యాంకనం ప్రక్రియ ఉంటుం దని అన్నారు. ఓయూ వీసీ డి రవీందర్ మాట్లా డుతూ సివిల్ సర్వీసెస్, పోటీపరీక్షల్లో రాణించడం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించడమే ఈ కోర్సు లక్ష్యమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్, బీఏ హానర్స్ కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. సెస్ డైరెక్టర్ రేవతి మాట్లాడుతూ యూజీసీ ఫార్మాట్లో సిలబస్‌ను రూపకల్పన చేశామన్నారు. ప్రపంచంలో, దేశంలో వేగంగా ఆర్థిక పరిణామాలు మారుతున్నా యని అన్నారు. బీఏ హానర్స్‌లో మూడేండ్ల కోర్సులో ఆరు సెమిస్టర్లకు 150 క్రెడిట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, నిజాం, కోఠి మహిళా కాలేజీ ప్రిన్సిపాళ్లు నారాయణ, విద్యుల్లత, ఓయూ ప్రొఫెసర్ జాడి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.