Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగతనం కేసులో విచారణకు పిలిచి చావుదెబ్బలు
నవతెలంగాణ - సూర్యాపేట
దొంగతనం కేసులో గిరిజనుడిని విచారణ పేరుతో పిలిచి చావుదెబ్బలు కొట్టిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామోజీతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ అనే గిరిజనుడిపై పోలీస్ స్టేషన్లో పలు చోరీ కేసుల్లో కేసు నమోదైంది. కేసు విషయంలో ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ లింగం బుధవారం అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న వీరశేఖర్ పోలీసుల దెబ్బలకు తాళలేక మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఆయన పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో పోలీసులు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అదే రోజు రాత్రి ఇంటికి పంపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ వీరశేఖర్‌ను చూసిన గిరిజనులు కోపోద్రిక్తులై గురువారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. సుమారు గంటన్నర పాటు ఆందోళన చేసి ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. బాధితున్ని తీసుకొని ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చికిత్స నిమిత్తం బాధితున్ని సూర్యాపేట ఏరియాస్పత్రిలో చేర్పించారు. మరి కొందరు ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్తుండగా సూర్యాపేట రూరల్ పోలీసులు కుడకుడ కాల్వ వద్ద వారిని అడ్డుకున్నారు. ఈ విషయం కాస్త మీడియాకు తెలిసి అక్కడికి వచ్చేసరికి పోలీసులు అడ్డు తప్పుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ విఠల్‌రెడ్డి ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్‌కు చేరుకొని బాధితుని బంధువులతో మాట్లాడారు. క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించి ఎస్ఐను సస్పెండ్ చేయాలని ఎస్పీకి సిఫార్సు చేస్తామని హామీనిచ్చారు. ఈ ఎస్ఐపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. ఇదే స్టేషన్లో సుమారు ఆరు నెలల కితం ఓ కేసులో విచారణ పేరుతో వ్యక్తిని తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతో ఒకరి చేయి విరిగింది. నాగారం పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువ రైతును చితక బాదడంతో ఆయన్ను అప్పటి ఎస్పీ ఆర్.భాస్కరన్ సస్పెండ్ చేశారు.