Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పాట్ కేంద్రాల వద్ద టిప్స్ నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో టిప్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యమ్రాలు జరిగాయి. టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, వేములు శేఖర్, నగేశ్, రహీం, గాదె వెంకన్న, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ మొదలైన మూల్యాంకన కేంద్రాల్లో నిరసనలు జరిగాయని వివరించారు. ఏఈలు 30 జవాబుపత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేందుకు అదేశాలు ఇవ్వాలని కోరారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే స్పాట్ కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలతోపాటు మూల్యాంకన విధుల్లో ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులే పాల్గొనడం వల్ల సుమారు నెలరోజులపాటు విద్యార్థులు బోధన లేకపోవడంతో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులు మూల్యాంకన విధుల్లో పాల్గొనాలని ఇంటర్ బోర్డు ఆదేశించినా వారు పూర్తిస్థాయిలో రావడం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలు వారిని పంపించడం లేదని పేర్కొన్నారు. వారంరోజులపాటు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ అధ్యాపకులు మూల్యాంకనంలో పాల్గొంటారని సూచించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వారికి బదిలీలు చేపట్టాలనీ, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యవైఖరిని విడనాడాలని కోరారు. కార్పొరేట్ శక్తుల నుంచి ఇంటర్ బోర్డు విముక్తి కావాలనీ, అధ్యాపక సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ దెబ్బతింటున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిప్స్ నాయకులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, శోభన్, వస్కుల శ్రీనివాస్, సుధాకర్, లక్ష్మయ్య, మంజునాయక్, బిక్యానాయక్, పరశురాములు, నారాయణ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.