Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణిలో పోర్టల్ మార్పులు చేయాలి
- అసైన్డ్, పోడు, బంజరు, ఇనాం, భూదాన భూములకు పట్టాలివ్వాలి: వ్యకాస ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ సభ తీర్మానం ఆధారంగా పోడు సాగు దారులందరికీ హక్కు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ మార్పులు తెచ్చి అసైన్డ్‌మెంట్, పోడు, బంజరు, ఇనాం, భూదాన భూములకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నారు. అటవీ హక్కు చట్టం-2006ను పార్లమెంట్ ఆమోదించిందని గుర్తుచేశారు. 15 ఏండ్లు గడిచినా దాని ఆధారంగా అనుభవ దారులకు హక్కు పట్టాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోడు భూములపై హక్కు పట్టాల కోసం దేశ వ్యాప్తంగా ఒత్తిడి పెంచే పోరాటాలు చేస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, నిత్యావసర ధరల నియంత్రణ చట్టానికి సవరణలు తేవడం వల్లే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు.. వాటిని నియంత్రించటంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. పోడు భూములను గుర్తించడానికి శాటిలైట్ సర్వే చేస్తే సాగుదార్లు భూములు కోల్పోయే ప్రమాదముందనీ, రాష్ట్ర వ్యాప్తంగా మ్యానువల్ సర్వే నిర్వహించి పోడు సాగు దారుల భూములను గుర్తించాలని సంఘం జాతీయ నాయకులు జి. నాగయ్య డిమాండ్ చేశారు. పోడు సాధన కమిటీల్లో రాజకీయ పార్టీల జ్యోక్యం తగ్గించాలనీ, గ్రామ సభ తీర్మానాన్ని సుప్రీంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనబోమనే ప్రభుత్వ ప్రకటనతో చిన్న, సన్న కారు రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకున్నదనీ, పంటలను నియంత్రించాలనే ఆలోచనను ప్రభుత్వం విడనాడాలని కోరారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్ సమావేశానికి అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, సహాయ కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎ. కనకయ్య, నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ్మ, ములకలపల్లి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, పెద్ది వెంకట్రాములు, జగన్, వెంకటయ్య, శశిధర్, రాంచందర్, సారంగపాణి, సైదులు, ఆవుల వీరన్న తదితరులు పాల్గొన్నారు.