Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో నిర్వహణ : ఆర్.తిరుమలై
- ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్‌గా మాజీ ఎంపీ అజీజ్‌పాషా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, యువజన సమస్యలపై దేశంలో విశాల యువజనోద్యమాన్ని నిర్మించేందుకు 2022 జనవరి ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు హైదరాబాద్‌లో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో గల సత్యనారాయణరెడ్డి భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో జరగాల్సిన మహాసభలు కోవిడ్ కారణంగా వాయిదాపడ్డాయని గుర్తుచేశారు. ఇప్పుడు చారిత్రాత్మక, సాంస్కృతిక, సామాజిక చైతన్యంగల హైదరాబాద్ నగరంలో మహాసభలను నిర్వహించబోతుండటం గర్వకారణంగా ఉందన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులు, ప్రత్యామ్నాయ ప్రతినిధులు సభలకు హాజరవుతారని తెలిపారు. సోషలిజం, శాంతి పురోగతికి మార్గం సుగమం చేసే భవిష్యత్తు పోరాట మార్గాన్ని నిర్ణయించుకుంటామని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని మోడీ సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్తంగా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలను తీవ్రం చేస్తామని ప్రకటించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ వలి ఉల్లాV్‌ా ఖాద్రి, అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఏఐవైఎఫ్ 16 వ జాతీయ మహాసభల సన్నాహక కమిటీని 68 మందితో వేశామనీ, చీఫ్ ప్యాట్రన్‌గా మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, అధ్యక్షులుగా సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహను ఎన్నుకున్నామని తెలిపారు. దేశభక్తి, జాతీయ పేరుతో యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే పరిస్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం తీసుకొచ్చి ఒక్కో పౌరుని ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. యువశక్తిని దేశాభివృద్ధికి వాడుకోవడంలో బీజేపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె, శంకర్, నిర్లేకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.