Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక కారణాల వల్లే ఉద్యోగాల భర్తీ జాప్యం
- త్వరలో డీఏ బకాయిలు విడుదల
- టీజీవోలకు సీఎం కేసీఆర్ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అయిన తర్వాత ఏర్పడే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకుని భారీస్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేతలతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. టీజీవో అధ్యక్షురాలు వి మమత, చైర్మెన్, మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో టీజీవో నేతలు సీఎం కేసీఆర్‌ను గురువారం ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్టు వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడడంలో జాప్యం జరిగినందున ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నందున ఉద్యోగాల భర్తీ జాప్యం జరిగిందని తెలిపారు. మరింత జాప్యం జరగకుండా ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీని సత్వరమే భర్తీ చేసే క్రమంలో కొత్త జిల్లాలకు ఆప్షన్లు, ఉద్యోగుల సీనియార్టీ ప్రాతిపదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయించాలని సూచించారు. దీంతో ఏర్పడిన ఖాళీలను నియామకాల ద్వారా భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ కృషివల్లే స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులంతా సహకరిస్తారని వివరించారు. ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కాలంటే ఈ ప్రక్రియకు ఉద్యోగులందరూ సహకరించి వెంటనే నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సహకారం ఇవ్వాలంటూ సీఎం కోరారని తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరామని పేర్కొన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారనీ, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, రాష్ట్ర సహాధ్యక్షులు ఎస్ సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణాయాదవ్, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యదర్శి బి వెంకటయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.