Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్చి పంటలకు వైరస్
- తోటలు దున్నుతున్న రైతులు
- వేల ఎకరాల్లో మిర్చి సాగుచేసి లక్షల్లో నష్టపోయిన అన్నదాతలు
- చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ
నవతెలంగాణ-కొణిజర్ల
గతేడాది మిర్చికి ధర ఎక్కువగా ఉండటంతో ఈఏడాది రైతులు మిర్చి సాగు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే అదునుగా భావించిన మిర్చి విత్తన డీలర్లు అధిక మొత్తంలో రైతులకు నకిలీ మిర్చి విత్తనాలు అంటగట్టారు. మంచి దిగుబడి వస్తుందని నమ్మబలికి రైతులను నట్టేట్టా ముంచారు. ఇప్పుడు వైరస్ సోకడంతో పీకేస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది.
కొణిజర్ల మండలం సింగరాయపాలెం, సిద్ధిక్ నగర్ గ్రామాలకు చెందిన 200 మంది రైతులు ఏన్కూర్ మండల కేంద్రంలోని ఓ పురుగుమందుల షాపులో సుమారు 350 ఎకరాలకు సరిపడా మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి తోటలు వేశారు. అప్పులు తెచ్చి భారీగా పెట్టుబడులు పెట్టి ఆశలు పెట్టుకున్న రైతులకు తోటల్లో మొక్కలు చచ్చిపోవడం, వేరుభాగంలో కుళ్లిపోవడం లాంటి వైరస్ సోకడంతో వారి ఆశలన్నీ అడిఆశాలయ్యాయి. అప్పులు తీర్చేది ఎలా.. బతికేది ఎలా.. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30 ఎకరాల్లో పంటను దున్ని వేరే పంట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా 2016, సెప్టెంబర్ నెలలో సింగరాయపాలెం గ్రామంలో ఇదేవిధంగా అధిక మొత్తంలో నకిలీ మిర్చివిత్తనాలు వందల ఎకరాల్లో సాగుచేసి రైతులు కోట్ల రూపాయల్లో నష్టపోయి అప్పులు పాలైన సంఘటనను రైతులు గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో సీపీఐ(ఎం), రైతు సంఘాలు, కాంగ్రెస్, టీడీపీ.. రైతుల పక్షాన నిలబడి పోరాడాయి. దాంతో ప్రభుత్వం నకిలీ విత్తనాల డీలర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపినా రైతులకు మాత్రం ఒక్కరూపాయి కూడా నష్టపరిహారం అందలేదు. ప్రతియేటా రైతులు నకిలీ మిర్చి, పత్తి, మొక్కజొన్న విత్తనాలు సాగుచేసి ఆర్థికంగా నష్టపోతున్నా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నారు.
రైతులను ఆదుకోవాలి
రైతుల మిర్చిపంటలు దెబ్బతినడంలో వ్యవసాయ అధికారుల పరివేక్షణ లోపం స్పష్టంగా ఉంది. మండల కేంద్రంలో కొంతమంది పురుగుమందుల వ్యాపారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ మిర్చివిత్తనాలు అంటకట్టడం వల్ల కాపుదశలో ఉన్న పంటలకు గుబ్బరోగం సోకడంతో ట్రాక్టర్లతో దున్నుతున్నారు. మండల కేంద్రానికి పక్కనే ఉన్న రేపల్లేవాడ గ్రామంలో కూడా కొంతమంది రైతులు తోటలకు వైరస్ సోకడంతో తొలగించి లక్షల్లో నష్టపోయారు. వ్యాపారులపై ఎన్ని కేసులు పెట్టినా నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ అధికారులు విఫలమౌతున్నారు. నష్టపోయిన రైతులకు విత్తనాలు విక్రయించిన డీలర్ల నుంచి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు మిర్చిపంటలను పరిశీలించి నష్టనివారణ చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి.
- దొంతబోయిన నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఏన్కూర్ మండల కార్యదర్శి