Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగు చేస్తున్నారని అడవుల నుంచి ఖాళీ చేయిస్తున్నారు..
- హైకోర్టులో పిల్
- రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుచేసే వారిని ఆ భూముల నుంచీ, అటవీ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. పోడు సాగు చేసే వారిని తొలగించకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు నిరాకరించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించాకే ఉత్తర్వులు ఇవ్వాలో లేదో తేల్చుతామని స్పష్టం చేసింది. పోడు సాగుదారులకు అనుకూలంగా, వాళ్లను అటవీ ప్రాంతం నుంచి తొలగింపును అడ్డుకోవాలని కోరుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు వేసిన పిల్‌ను గురువారం చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమనీ, చట్ట విరుద్ధమనీ, పోడు సాగుదారులు పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు సుమారు లక్ష వరకూ 15 ఏండ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దష్టికి తెచ్చారు. విచారణ జనవరికి వాయిదా పడింది.
కరోనా మతుల లెక్కల కోసం కమిటీ
కరోనాతో మరణించిన వారి వివరాలను లెక్క తేల్చేందుకు కమిటీ వేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. జీఓ 151 జారీ చేసి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపింది. దీనిపై కౌంటర్ వేసేందుకు నెల రోజులు గడువు కావాలని కోరింది. దీంతో కమిటీ ఏర్పాటు కోసం దాసోజు శ్రవణ్ వేసిన పిల్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్టు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ప్రకటించింది.
ఏపీఐడీసీకి ఎదురుదెబ్బ
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి సంస్థ (ఏపీఐడీసీ) తన వాటాకు మించి ఒక్క రూపాయిని కూడా బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఐడీసీ వేసిన రిట్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ 58 శాతం వాటా నిధుల్ని తీసుకోవాలనీ, మిగిలిన 42 శాతం తెలంగాణకు చెందుతాయని అదనపు ఏజీ రామచందర్‌రావు చెప్పారు. ఏపీఐడీసీ ఎక్కువ సొమ్ము విత్‌డ్రా చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. తాము ఎక్కువ విత్‌డ్రా చేయలేదని ఏపీ ఏజీ శ్రీరాం చెప్పారు. ఈ క్రమంలో ఏపీఐడీసీకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు విచారణను జనవరికి వాయిదా వేసింది.
మాకేంటి సంబంధం?
జగన్ ఆస్తుల కేసుతో ముడిపెట్టి తమపై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వాన్‌పిక్, ఆ కంపెనీ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన కేసుల విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. పిటిషనర్లు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నారనీ, పన్నుల చెల్లింపులు కూడా సక్రమంగా చేస్తున్నారని, జగన్‌పై రాజకీయ ద్వేషంతో పెట్టిన కేసులతో తమ సంబంధాన్ని అంటగట్టడం చెల్లదని జస్టిస్ షమీమ్ అక్తర్ ఎదుట పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. అనంతరం కేసు సోమవారానికి వాయిదా పడింది.