Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి మీరేం చేశారు..?
- చేతనైతే విభజన హామీలను అమల్జేయించండి : విలేకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి... బీజేపీకి చెందిన సోషల్ మీడియా ద్వారా, విలేకర్ల సమావేశాల్లోనూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వైద్య కళాశాలల ఏర్పాటు, ఎయిమ్స్ తదితరాంశాలపై ఆయన తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కిషన్‌రెడ్డి స్థాయికి తగవని హితవు పలికారు. ఆయనకు చేతనైతే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ అమల్జేయించాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యదర్శులు సోమ భరత్, ఎమ్.శ్రీనివాసరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. వంట గ్యాస్‌పై పన్నులు, ధాన్యం కొనుగోళ్లు, కేసీఆర్ కిట్ తదితర విషయాల్లో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. బీబీ నగర్లో నిమ్స్ కోసం కేటాయించిన స్థలాన్ని... రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కోసం అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకానికి కేంద్రం నిధులు వాడుకున్నామంటూ చెప్పటం శోచనీయమన్నారు. మోడీ హయాంలో దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు... కానీ తెలంగాణకు మాత్రం ఒక్కటీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ మొత్తం 31 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కిషన్‌రెడ్డికి రాష్ట్రం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... మిగతా 10 జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వ విద్యాలయం ఏమయ్యాయని ప్రశ్నించారు. వరంగల్‌లో ఏర్పాటు చేయాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీని లాథూర్‌కు తరలించారని చెప్పారు. ఇలా తెలంగాణకు అనేక విషయాల్లో కేంద్రం అన్యాయం చేసిందని వివరించారు.
బీజేపీ తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని... మన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయించాలని కోరారు. తద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలిస్తున్న మోడీ సర్కారు.. రైతలను ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం యూ టర్న్ తీసుకుందని హరీశ్‌రావు ఈ సందర్భంగా విమర్శించారు.