Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రిమెంట్ లేకుండానే అంటగడుతున్న వైనం
- విచ్ఛలవిడిగా మొక్కజొన్న విత్తనాల పంపిణీ
- అధిక దిగుబడి వస్తుందంటూ ప్రలోభాలు
- పండిన తరువాత చేతులెత్తేస్తున్న పరిస్థితి
- పత్తాలేని వ్యవసాయ అధికారులు
నవతెలంగాణ-వెంకటాపురం
ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో సీడ్ ఆర్గనైజర్ల మోసాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరు ద్ధంగా అగ్రిమెంట్ లేకుండా రైతులకు సీడ్ మొక్కజొన్న విత్త నాలు అంటగడుతున్న దుస్థితి నెలకొంది. దిగుబడి రాని పక్షం లో తమకు సంబంధం లేదనే రీతిలో ఆర్గనైజర్లు వ్యవహరి స్తున్నారు. రైతులు తమకు జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పుకో వాలో తెలియక దిగాలు చెందుతున్నారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గోదావరి పరీవాహక ప్రాంత నల్లరేగడి నేల వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ వేసే పంట లకు డిమాండ్ఉంది. ఈక్రమంలో విత్తన కార్పొరేట్ కంపెనీల కన్ను ఏజెన్సీలోని సారవంతమైన భూములపైపడింది. దీంతో కొన్ని బహుళజాతి కంపెనీలు ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకుని రైతులతో మొక్కజొన్న విత్తన వ్యవసాయం చేయిస్తున్నారు. వెంకటాపురం మండలంలో సింజెంటా, పయనీర్, సీపీ, కావేరి రకాలకు చెందిన మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. మండలపరిధిలోని బెస్తగుడెం, మరికాల, నూగూరు, చొక్కాల, ఉప్పేడు, గోదావరి పరీవాహక ప్రాంతలైన గడ్డపై సుమారు వెయ్యి ఎకరాల్లో సింజెంటా, బెస్తగూడెం, వీరభద్రవరం గడ్డపై సుమారు నాలుగు వందల యాబై ఎకరాల్లో సీపీ, మిగతా ప్రాంతాల్లో పయనీర్, కావేరి రకాల విత్తనాలు అంటగడుతూ వ్యవసాయం చేయిస్తున్నారు. ఎకరానికి 5-6 టన్నుల దిగు బడి వస్తుందని సింజెంటా టన్నుకు రూ.24 వేలు, సీపీ రకం టన్నుకు రూ.20 వేలు, పయనీర్ రూ.22 వేలకు మించి పరిస్థితులను బట్టి ధర చెల్లిస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మొ దట గింజలు నాటే సమయంలో ఎకరానికి రూ.10-15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని, పంటకు కావల్సిన ఎరువులు, పురుగు మందులు తామే అందిస్తామని నమ్మిస్తున్నారు. ఆర్గనైజర్లు సూచించిన రీతిలోనే రైతులు వ్యవసాయం చేయాల్సి ఉంది. ఆర్గనైజర్లు చెప్పిన మేరకు దిగుబడి రాకున్నా వారు ముందుగా నిర్ణయించిన ధర రైతులకు చెల్లించకున్నా పట్టించుకునే నాధుడే లేడు.
ఒప్పందం లేకుండానే..
రైతులతో ఆర్గనైజర్లు ఒప్పంద వ్యవసాయం చేయించే సమయంలో ఎన్ని ఎకరాలు, ఏయే సర్వే నెంబర్లలో తమ కంపెనీ పంట వేస్తున్నారు, ఎకరానికి ఎన్ని టన్నులు దిగుబడి వస్తుంది, ముందస్తుగా ప్రకటించిన టన్ను ధర ఎంత అనే అంశాలతో డీలర్లు, రైతులు ఒప్పంద పత్రాలు రాసుకోవాలని నిబం ధనలు ఉన్నాయి. అయితే, ఎలాంటి ఒప్పందం లేకుండానే ఆర్గనైజర్లు రైతులతో సాగు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నా మంటూ ఆశచూపి బహుళజాతి కంపెనీల ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. గోదావరి లోయలో పండించే మక్కలు విత్తనోత్పత్తి కోసం పండిస్తున్న వాణిజ్య పంట కావడంతో రైతులకు లాభాల్లో వాటా ఇవ్వాలని, కనీస మద్దతు ధర కన్నా నాలుగు రెట్లు అధికంగా ధర నిర్ణయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించక పోవడమే కాకుండా పెట్టుబడులపై వడ్డీ, క్రిమిసంహారక మందులు, ఇతర ఖర్చుల పేరుతో భారీ మొత్తాలను మినహాయిస్తూ ఏజెంట్లు రైతుల నడ్డి విరుస్తున్నారు. పంట చేతికొచ్చి కంపెనీలకు తరలించిన తర్వాత మూడు నెలలు గడచినా రైతులకు డబ్బు చెల్లించక పోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.
పీసా చట్టాన్ని పట్టించుకోని వైనం
ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న షెడ్యూలు ప్రాంతాల్లో పీసా చట్టం ప్రకారం ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో గ్రామసభల్లో నిర్ణయించాలి. ఆ మేరకే వ్యవసాయ శాఖ కంపెనీలకు అనుమతులు ఇవ్వాలి. కానీ విత్తన కంపెనీలు పీసా చట్టాన్ని తుంగలో తొక్కి దశాబ్ధ కాలంగా వేలాది ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ ప్రణాళికల కోసం పీసా గ్రామ సభలు నిర్వహించలేదు.
కాంట్రాక్టు వ్యవసాయ చట్టం చెల్లదు
ఏజెన్నీ ప్రాంతంలో భూమి బదలాయింపు నిషేధిత చట్టం 1959, 1/70 రెగ్యూలేషన్ అమల్లో ఉండటంతో ఆ ప్రాంతంలో వ్యవసాయదారులతో కుదుర్చుకునే ఒప్పందాలు చెల్లవు. అధికారికంగా, అనధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకుంటే ఎల్టీఆర్ చట్టం కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా అధికారి యంత్రాంగం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం. ఏజెన్సీ ప్రాంతంలో విత్తనోత్పత్తి చేస్తున్న బహుళజాతి కంపెనీలు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో, ఏ పంట వేస్తున్నారో సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకుని ముందస్తు అనుమతి పొందాలి. లేనిపక్షంలో సంబంధిత కంపెనీలకు ఆ శాఖ నోటీసులు జారీ చేయాలి. కానీ కంపెనీలు పంటల వివరాలను నమోదు చేయడం లేదు. జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి ఏజెన్సీలో రైతులు సాగు చేస్తున్న వివరాలను సేకరించి నిబందనలకు విరుద్ధంగా రైతులతో పంట సాగు చేయిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వ్యవసాయ శాఖకు పట్టింపేది : రైతు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ
బహుళ జాతి సంస్థలు రైతులలో సాగుచేయిస్తున్న విత్తన కంపెనీలపై వ్యవసాయ శాఖ పట్టింపు కరువైంది. నిబంధనలకు విరుద్దంగా బహుళజాతీ కంపెనీలు కొన్ని మండలాల్లో ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేయిస్తున్నారు. ముందస్తుగానే ఆర్గనైజర్లు ధరలు నిర్ణయిస్తున్నారు. ఎకరానికి ఇంత దిగుబడి వస్తుందని , ఈ ధరకు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఆర్గనైజర్లు చెప్పిన దిగుబడి రాకున్నా, ముందుగా నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయకున్నా కంపెనీ యజమానులను నిలదీసే పరిస్దితులు లేవు. రైతులతో బహుళజాతి కంపెనీలు చేయిస్తున్న వ్యవసాయంపై అగ్రిమెంట్ చేసుకోవాలనే నిబంధనలు ఉన్నా బహుళజాతి సంస్దలు చేస్తున్న వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. మండలంలో పూర్తి స్థాయి వ్యవసాయశాఖ అధికారిని నియమించాలి.
వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలి
డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఎన్.శ్రీధర్
ఏజెన్సీలో బహుళజాతి సంస్దలు రైతులతో చేయిస్తున్న వ్యవసాయ సాగు , రైతుల వివరాలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు.సర్వే నెంబర్లతో వ్యవసాయ కమీషనర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు తప్పని సరిగా ఆకంపెనీలు సమాచారం ఇవ్వాలి. రైతులతో నిర్ణయించిన దిగుబడులు, నిర్ణయించిన ధరలకు సంబందించి రైతులు , కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. పంట దిగుబడి రాకున్నా, పంటనష్టం వాటిల్లితే అగ్రిమెంట్ గనక ఉంటే విత్తన కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం లేదు. అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేస్తే కంపెనీలపైన ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదు.