Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్యాగాలను స్మరించుకుంటూ .. ఆశయ సాధన కోసం పయనిద్దాం
- అటవీ హక్కుల చట్టాలకు తూట్లు పొడుస్తున్న మోడీ ప్రభుత్వం
- పార్లమెంట్లో గిరిజన ఎంపీలు మాట్లాడకపోవడం శోచనీయం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందా కరత్
- ఏజెన్సీ అభివృద్ధి ప్రదాతలు : తమ్మినేని వీరభద్రం
- త్యాగాలకు, ఉద్యమాలకు ఖిల్లా భద్రాద్రి ఏజెన్సీ : పి.మధు
- భద్రాచలంలో స్మారక స్థూపాల ఆవిష్కరణ
నవతెలంగాణ-భద్రాచలం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య ఏజెన్సీ మణిరత్నాలు అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందాకారత్ కొనియాడారు. గురువారం సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఏర్పాటు చేసిన మన్యం మార్కిస్టు పార్టీ ముద్దు బిడ్డలు కామ్రేడ్ కుంజా బొజ్జి, కామ్రేడ్ సున్నం రాజయ్యల స్మారక స్థూపాలను సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి.మధుతో కలిసి బృందాకరత్ ఆవిష్కరించారు. ముందుగా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ నుంచి స్మారక స్థూపాల సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు చూపిన ఆశయ సాధన కోసం అందరూ పయనించినప్పుడే వారికి నిజమైన నివాళి అని బృందాకరత్ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఉద్యమాలను నిర్మించుకుంటూ పార్టీ పురోభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నదని అన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే సమయంలో కుంజా బొజ్జి, సున్నం రాజయ్య సాదాసీదా జీవితం గడుపుతూ ఆదర్శ మార్గంలో నడిచారని గుర్తుచేశారు. దేశంలో, రాష్ట్రంలో పాలకపార్టీలు ప్రజా మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులను నోట్లకట్టలతో కొనుగోలు చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నారని విమర్శించారు. దేశంలో 49 పార్లమెంట్ ఎస్టీ స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఎంపీలు.. షెడ్యూల్డ్ తెగల సమస్యల కోసం పార్లమెంటులో మాట్లాడకపోవడం శోచనీయన్నారు. గిరిజనులకు, చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నప్పటికీ గిరిజన ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడం అత్యంత దారుణమన్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ, అడవి నుంచి ఆదివాసులను దూరం చేయాలనే మహా కుట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. అయినా వారికోసమే ఆ ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతుందన్నారు. దీనిపై అక్కాచెల్లెళ్లు పోరాడాలని పిలుపునిచ్చారు. ధరలెందుకు పెరుగుతున్నాయో ఆలోచించాలన్నారు. పోడు రైతుల తరపున, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన, ఉద్యమాలు చేయడం అభినందనీయని అన్నారు. సీపీఐ(ఎం), ఇతర పార్టీల ఆందోళనలతోనే రాష్ట్రప్రభుత్వం దిగివచ్చి గిరిజనులకు పట్టాలివ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. దాంతో పాటు గతంలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ్మినేని మాట్లాడుతూ.. ఏజెన్సీ అభివృద్ధి ప్రదాతలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలని కొనియాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, రైతాంగ సమస్యలను గాలికి వదిలి కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. 12 నెలలుగా రైతులు తమ హక్కుల కోసం ఆందోళన, ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో ముంచి పాలన సాగిస్తోందని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపడతామని టీిఆర్‌ఎస్ ప్రకటించటం రాజకీయం కోసమే అన్నారు. సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి మధు మాట్లాడుతూ.. త్యాగాలు, ఉద్యమాలకు ఖిల్లా భద్రాద్రిఏజెన్సీ ప్రాంతమని అన్నారు. కేంద్రంలో మోడీ పాలనకు కాలం చెల్లిందని చెప్పారు. రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా, నిత్యం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుకుంటూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి అనుగుణంగా చట్టాలను సవరణలు చేస్తూ, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని తెలిపారు.
ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు, పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడారు. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడగా ప్రముఖ అడ్వకేట్ రమేష్ తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, నాయకులు బత్తుల హైమావతి, ఏజే రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు, కాసాని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.