Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు విద్యకు దూరమయ్యే ప్రమాదం : జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన విద్యావిధానం మూలంగా సమాజ వినాశనం తప్పదని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త వ్యవస్థతో పేదలకు చదువుదూరమయ్యే ప్రమాదం ముంచుకొస్తున్న దని చెప్పారు. అప్రమత్తంగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. గురువారం డాక్టర్ మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా విష్ణు ఫార్మాస్యూటికల్, పరిశోధన సంస్థ నేతృత్వంలో జాతీయ విద్యాదినోత్సవం జరిగింది. అందులో భాగంగా నూతన విద్యా విధానంపై వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందె సత్యం మాట్లాడుతూ నూతన విద్యావిధానం నేపథ్యంలో అనుబంధ కాలేజీల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోనుందన్నారు. వాటి సంఖ్యను దాదాపు 40 వేల నుంచి 15 వేలకు తగ్గించడం ప్రయివేటీకరణకు బాటలు వేయడమేనని వ్యాఖ్యానించారు. బీఈడీ కాలేజీల్లోని నాలుగు సంవత్సరాల కోర్సులో రెండేండ్లు భారతీయ విలువల గురించి నేర్పుతామని కేంద్రం చెబుతున్నదన్నదన్నారు. ఇది మూఢనమ్మకాలను ప్రచారం చేయడానికేనని చెప్పారు. యూజీసిని రద్దు చేసి సీఆర్ఎఫ్ను తెచ్చింది నిధులు మళ్లించడానికేననీ, తద్వారా సూడోసైన్స్ ప్రాజెక్టును ప్రొత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. డిగ్రీకి సంబంధించి ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఇస్తామనడం వల్ల పేద, మధ్యతరగతుల నుంచి డ్రాపౌట్ రేటు పెరిగే అవకాశముందని వివరించారు. ఎమ్‌ఫిల్ డిగ్రీని తీసేస్తే పిహెచ్డీల నాణ్యతతగ్గనుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తే, ఉమ్మడి షెడ్యూల్లోని విద్యారంగంపై కేంద్రం పెత్తనం పెరుగుతుందన్నారు. ఉన్నత విద్యలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మూలంగా చదువు పేదలకు మరింత భారంగా కానుందన్నారు.తద్వారా రాజ్యాంగ విలువల నుంచి పక్కదారి పట్టి పొరపాట్లు జరుగుతాయని వివరించారు. దీంతో విద్యా వ్యాపారీకరణ మరింత సులువు కానుందన్నారు. విద్యను నియంత్రించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో 50 శాతం మంత్రులే సభ్యులుగా ఉండటం మూలంగా రాజకీయ జోక్యం పెరగడానికి అవకాశముందని తెలిపారు. ఈనేపథ్యంలో నూతన విద్యావిధానంపై కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆలోచించాలని సూచించారు. కొత్త విద్యావిధానం అమలు జరిగితే సూడోసైన్స్, మతతత్వం, ప్రయివేటీకరణ, పేదలకు విద్య నిరాకరణ తదితర నష్టాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ వెబినార్‌లో విష్ణు ఫార్మాస్యూటికల్, పరిశోధనా సంస్థకు చెందిన 600 మంది ఎంఫార్మసీ, బీఫార్మసీ విద్యార్థులు, 50 మంది ఫ్యాకల్టీ పాల్గొన్నారు.