Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆనాడు వద్దన్న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దాని సాధన కోసం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాల ద్వారా తిరిగి సాధించుకున్నాయని గుర్తు చేశారు. ఆనాడు వద్దన్న ధర్నాచౌక్‌లో నేడు టీఆర్ఎస్ ధర్నా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఊరి చివరన ధర్నాలు చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ తాము ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే కేసు లు నమోదు చేసి, లాఠీలతో పోలీసులు కొట్టారని తెలిపారు. తాను, పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టును ఆశ్రయిస్తే నిబంధనలతో ధర్నాలు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. ప్రజల గొంతుకలను ప్రభుత్వానికి తెలిపేందుకు అవకాశం దొరికిందని వివరించారు. ప్రభుత్వాలు ఎప్పటికైనా ప్రతిపక్షంలోకి రావాల్సిందేనని తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రాష్ట్రంలో వడ్లు కొనే పరిస్థితి లేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ డ్రామాలాడుతున్నాయని పేర్కొన్నారు. యాసంగిలో వడ్లు కొనేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం తప్పిదం వల్ల శ్రీరాంపూర్ బొగ్గుగనిలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.