Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అజిత్ దోవల్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశ సమగ్రత, ఐక్యత, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర ఐపీఎస్లదేనని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభ్‌భారు పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన 73వ ఐపీఎస్ ట్రైనీ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అత్యంత వైభవంగా జరిగిన యువ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ నుంచి ఆయన గౌరవ సెల్యూట్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న తీవ్రవాద, ఉగ్రవాద, మతపరమైన సమస్యలతో ఏర్పడే శాంతి భద్రతల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవల్సిన బాధ్యత ఐపీఎస్ అధికారులదేనని ఆయన అన్నారు. ఈ సారి ఎంపికైన ఐపీఎస్‌లలో మహిళలూ పెద్ద సంఖ్యలో ఉండటాన్ని ఆయన అభినందించారు. ఎన్పీఏ డైరెక్టర్ అతుల్ కర్వాల్ మాట్లాడుతూ.. ఈ సారి 149 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణను ముగించుకోగా ఇందులో 31 మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే, 17 మంది విదేశీయులున్నారనీ, వీరు భూటాన్, మాల్దీవ్, నేపాల్ దేశాల వారని ఆయన చెప్పారు. వీరికి శాంతి భద్రతలు కాపాడటం మొదలుకొని నేర విచారణ, జ్యుడిషియల్, పౌర హక్కులు మొదలైన అనేక అంశాలలో శిక్షణ అందిందన్నారు. ఈ కోర్సులో అన్ని రంగాలలో అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన దర్పణ్ అహ్లూవాలియాకు ఆల్‌రౌండ్ ఛాంపియన్షిప్ ట్రోఫిని బహూకరించారు.