Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి
- 2017 బ్యాచ్ ఫారెస్ట్రీ విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా నిపుణులైన అటవీ అధికారుల అవసరం పెరుగుతున్నదనీ, ఆ అవసరాలను తీర్చే దిశగా ఎఫ్సీఆర్ఐ ముందు వరుసలో ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ప్రశంసించారు. ములుగులోని అటవీకళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ) పట్టభద్రుల ఉత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాలుగేండ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన 2017 బ్యాచ్‌కు చెందిన 48 మంది ఫారెస్ట్రీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఫారెస్టు కాలేజీ నేడు అద్భుత ఫలితాలను సాధిస్తున్నదని తెలిపారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కళాశాల సిబ్బందిని అభినందించారు. పీసీసీఎఫ్ శోభ మాట్లాడుతూ..ప్రారంభించిన కొన్నేండ్లలోనే ఫారెస్ట్ కాలేజీ అంతర్జాతీయ ప్రమాణాలను సాధించిందనీ, విద్యార్థుల్లో పోటీతత్వం నింపుతూ కెరీర్లో రాణించేలా ప్రమాణాలను నెలకొల్పిందని ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీ.లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. అత్యుత్తమ సౌకర్యాలు, పచ్చదనంతో నిండిన ఫారెస్ట్ కాలేజీ క్యాంపస్‌ను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడి క్లిష్టమైనదిగా భావించే అటవీ విద్య వైపు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు రావటం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ..జాతీయ స్థాయి అటవీ కళాశాలను నెలకొల్పటంతో పాటు మంచి సివిల్ సర్వీసు అధికారులను దేశానికి అందించాలనే సంకల్పంతో ఏర్పాటైన ఫారెస్ట్ కాలేజీ ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు. పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కార్పోరేషన్ ఎండీ చంద్రశేఖర రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు అక్బర్, సునీతా భగవత్, రిటైర్డ్ ఉన్నతాధికారులు బీపీ ఆచార్య, పీ.కే.జా, మనోరంజన్ భాంజా, డిప్యూటీ డైరెక్టర్లు సుతాన్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, కాలేజీ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.