Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
- 40 మందికి తీవ్రగాయాలు
- కండక్టర్తోపాటు మరో ఇద్దరి పరిస్థితి విషమం
- ఘటన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు
- ఘటనపై మంత్రి సబితా ఆరా
నవతెలంగాణ-మర్పల్లి
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని ఖల్కుడ చౌరస్తా, గుర్రం గట్టు తాండ చౌరస్తా మధ్యన శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కండక్టర్తోపాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సంగారెడ్డి డిపోకు చెందిన టీఎస్15 యూడీ6441 నెంబర్ గల ఆర్టీసీ బస్సు 60మంది ప్రయాణికులతో సంగారెడ్డి నుంచి తాండూర్ వెళ్తోంది. గుర్రంగట్టు తాండ శివారులోకి రాగానే అతి వేగం కారణంగా అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 11 మంది కాళ్లు, 14 మంది ప్రయాణికులకు చేతులు విరిగాయి. కండక్టర్ రాజమణి, యాచారం గ్రామానికి చెందిన కేసారం నాగమ్మ అనే ప్రయాణికురాలతోపాటు మరో ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురై అరుపులు, కేకలు వేస్తూ గాయాలతో బస్సు బయటకు వచ్చారు. ప్రయాణికుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది.