Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ ఎవరికైనా నో ఎంట్రీ
- సందర్శకులు, సామాన్య ప్రజలు, పాత్రికేయులకూ అనుమతి లేని వైనం
- గంటల తరబడి లైన్లో నిలబడుతున్న జనం
- సీఎస్ ఆదేశాల ప్రకారమే అంటున్న భద్రతా సిబ్బంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఇటు ప్రభుత్వం, అటు వైద్యారోగ్యశాఖ ప్రకటించాయి. టీకా ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలో మద్యం షాపులు, సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు కూడా తెరుచుకున్నాయి. బళ్లు కూడా ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకూ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ జనాన్ని వందల సంఖ్యలో పోగేశాయి. శుక్రవారం అధికార పార్టీ నిర్వహించిన ధర్నాల్లో కూడా వేలాది మంది పాల్గొన్నారు. ఈ రీతిలో కార్యక్రమాలు కొనసాగుతున్నా ఎక్కడా గతంలో మాదిరిగా కరోనా కేసులు నమోదవటం లేదు. జనాలు సాధారణ స్థితికి వచ్చి కూడా చాలా రోజులైంది. కానీ అదేం విచిత్రమో తెలియదు ...హైదరాబాద్‌లో సీఎస్ కొలువుండే బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌ను 'కరోనా బూచి, భయం...' ఇంకా వెంటాడుతున్నాయి. ఈ భయం, బూచి వల్ల పాపం... అక్కడి భద్రతా సిబ్బంది, పోలీసులు ఏ ఒక్కరినీ లోనికి పోనివ్వటం లేదు. కోవిడ్ నిబంధనలను వారు 'తూ.చా.తప్పకుండా...' పాటిస్తూ సందర్శకులు, సామాన్య ప్రజలు, చివరకు పాత్రికేయులు, లాయర్లను సైతం ఆ భవన్‌లోకి అనుమతించటం లేదు. ఇదేంటని ఎవరైనా అడిగితే... 'సీఎస్ గారి ఆదేశాల మేరకు... కరోనా నిబంధనలు మేం విధిగా పాటిస్తున్నాం... కావాలంటే గోడ మీద సీఎస్గారి పేరిట అంటించి ఉన్న నోటీసును చదువుకోండి...' అంటూ వారు సూచిస్తున్నారు. అయితే ఆ నోటీసు ఈ యేడాది ఏప్రిల్ మూడో తేదీది కావటం గమనార్హం. అప్పటి నుంచి అదే నోటీసును చూపిస్తూ... జనాలను బీఆర్కే భవన్‌లోకి అనుమతించకపోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విలేకర్లు గానీ, సాధారణ ప్రజలు గాని ఆ భవన్‌లోని ఒక ఉన్నతాధికారిని కలవాలంటే... ఆయన పేషీ నుంచి నేరుగా కింది గేట్లోకి ఫోన్ చేయించాల్సిందే. మారుమూల పల్లెటూళ్ల నుంచి వచ్చే సాధారణ జనాలకు అలా ఫోన్ చేయించటం సాధ్యమయ్యే పనే కాదు. ఈ క్రమంలో వారు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని బతిమాలుతూ గంటల తరబడి లైన్లలో నిలబడుతూ కనిపిస్తున్నారు. గద్వాల జిల్లాకు చెందిన ఓ బాధితుడు ఇదే రకమైన ఆవేదనను వ్యక్తం చేశాడు. నాంపల్లికి చెందిన రజియా సుల్తానా ఒక ఒంటరి మహిళ. ఆమెకు నా అనేవారు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఇటీవల ఆమె కంటికి, కాలుకి ఒకేసారి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో... ఉన్నతాధికారులను కలిసి అర్జీ ఇచ్చి పోదామని వచ్చిన ఆమెను, బీఆర్కే భవన్ భద్రతా సిబ్బంది గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ లోనికి పంపకుండా నిలబెట్టటంతో కన్నీళ్ల పర్యంతమైంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనల సాకు చూపి జనాన్ని దూరం పెట్టకుండా బీఆర్కే భవన్ లోకి ఇప్పటికైనా అనుమతించాలని పలువురు కోరుతున్నారు.