Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీ ద్వంద వైఖరి వీడాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- వరి సాగుపై ఆంక్షలు పెడితే పోరాడతామని హెచ్చరిక
- సీపీఐ(ఎం), సీపీఐ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో అంటకాగుతూనే ఆందోళనలు చేయడం వింతగా ఉందనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వీడి వెంటనే కొనుగోళ్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాసంగిలో వరిసాగు చేయవద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం), సీపీఐ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సీపీఐ చేపట్టిన ధర్నాలో చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ఆయన ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతులకు ఉరితాళ్లు పేనుతున్నారని ఆరోపించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూనే మరోవైపు ఆందోళనలు చేయడం కేసీఆర్ నాటకానికి నిదర్శనమన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టి.సాగర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టే రీతిలో ద్వంద వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. తరుగులో కోత విధించవద్దనీ, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), ప్రజాంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, పెద్దపల్లి రామగుండం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. పరిష్కారం చూపాల్సిన పాలకులే.. రైతుల గురించి పట్టించుకోకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ, టీఆర్ఎస్లు పోటాపోటీగా ధర్నాలకు దిగడం సిగ్గుచేటన్నారు.రంగారెడ్డి జిల్లా షాబాద్ పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ క్రాంతి కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.