Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ తీరిది
- సీఎం చెప్పినట్టు హస్తినలో ధర్నా ఉంటుందా..? ఉండదా...?
- గతంలో భారత బంద్‌లో పాల్గొని యూ టర్న్ తీసుకున్న గులాబీ పార్టీ
- హస్తినలో రైతులకు సంఘీభావం తెలుపుతానంటూ వెళ్లి... మోడీకి సలాం
- రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఏం చేస్తారనే దానిపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల అంశం పట్ల అధికార టీఆర్ఎస్ వైఖరి 'రోగమొకటైతే.. మందు ఇంకోటి...' అన్నట్టుగా ఉంది. నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది, అందులో భాగంగా ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ప్రకటించింది కేంద్రంలోని మోడీ సర్కార్. ఈ వాస్తవాన్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ఇక్కడి బీజేపీ అసలు సిసలు రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇదే క్రమంలో ఇటీవల వెలువడిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో కారు పార్టీ కార్యకర్తల్లో కొంతలో కొంత నైరాశ్యం నిండగా... ఆ పార్టీ పెద్ద తలకాయల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ అందరికీ తలబొప్పికట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 'ఆ బొప్పి'కి అమృతాంజనం రాసే పని మొదలెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తం గా టీఆర్ఎస్ నిర్వహించిన 'ధాన్యం ధర్నాలు...' కమలం పార్టీ రాజకీయ డ్రామాలకు పోటీగా మరింత ఆసక్తికరమైన నాటకాలుగా మారాయి తప్పితే... మోడీ సర్కారు వ్యవ సాయ విధానాలను, అది తీసుకొచ్చిన చట్టాలను ఎక్కడా సూటిగా, స్పష్టంగా ప్రశ్నించలేదనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తున్నది. అందుకే నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నిర్వహించిన ధర్నాలు రాజకీయపరమైన ఆందోళనలే తప్ప... విధాన పరమైన పోరాటాలు కాదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమది 20 ఏండ్ల ప్రస్థానం, 60లక్షల సభ్యత్వం వీటికితోడు అద్భుత మైన నాయకత్వం అంటూ మొన్నటి ప్లీనరీ సందర్భంగా నొక్కి వక్కాణించిన గులాబీ దళపతి... ఇంత అద్భుతమైన పార్టీ యంత్రాగం, సమర్థతగల ప్రభుత్వం ఉన్న చోట బస్తీ మే సవాల్ అంటూ 'ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదనే...' వాదనలు వినబడుతున్నాయి. ఈ సందర్భంగా గతంలోని పలు సంఘటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అప్పట్లో నిర్వహించిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించి, పాల్గొంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా జడ్చర్ల టోల్గేట్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆయా చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతు నేతలకు సంఘీభావం తెలుపుతానంటూ హస్తిన విమానమెక్కిన సీఎం కేసీఆర్... అక్కడికెళ్లిన తర్వాత కనీసం వారి ముఖం కూడా చూడలేదు. నేరుగా ప్రధాని మోడీని కలిసి శాలువా కప్పొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా మళ్లీ వ్యవసాయ నల్లచట్టాలు గానీ, మోడీ సర్కారు విధానాలుగాని కారు పార్టీ సారధికి గుర్తుకు రాలేదు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో... 'ధాన్యం కొనుగోళ్ల కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తాం' అంటూ సీఎం మరోసారి ప్రకటించారు. కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఆ ప్రకటనను మరిచి... ఆయన యూ టర్న్ తీసుకుం టారా..? లేక నిజంగానే చిత్తశుద్ధితో దేశ రాజధానిలో ఆందోళన చేపడతారా...? అనేది వేచి చూడాలి. తెలంగాణ కోసం పులి నోట్లో తలకాయ పెట్టానని చెప్పుకునే కేసీఆర్... ధాన్యం విషయంలో రైతుల్ని ముందుండి గెలిపించాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, రైతు సంఘాలన్నింటినీ తీసుకుని ఢిల్లీ గల్లీలో కొట్లాడాలంటూ రైతు నేతలు సూచిస్తున్నారు. తద్వారా ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది... కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు అభిప్రాయపడుతు న్నారు. లేదంటే గతంలో మాదిరిగానే మరోసారి రైతులు మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రానున్న శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు వ్యవసాయ చట్టాలు, ధాన్యంకొనగోళ్లకు సంబంధించి కేంద్రాన్ని నిలదీస్తారా..? లేక 'మౌనమే నీ భాష ఓ మూగమనసా...' అన్నట్టు వ్యవహరిస్తారా..? అనేది వేచి చూడాలి.