Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధార్‌తో లింక్ ఉన్న ఫోన్‌కే..
- ఏ ఫోన్ నెంబరో కూడా తెలియని అన్నదాత
- ధాన్యం కొనుగోళ్లు తగ్గించేందుకు ఇదో మెలిక
- నాణ్యత ఉంటేనే కొనాలని సర్కారు మౌఖిక ఆదేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు తమ ధాన్యం అమ్ముకునేందుకు పొలాల నుంచి ఇంటర్నెట్ సెంటర్‌కు పరిగెత్తే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఆధార్‌కార్డు, అకౌంట్బుక్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లు ఇస్తే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ (పీపీసీ) అన్నీ చక్కబెట్టేది. రైతుకు సెల్‌నెంబర్ లేకపోయినా అందుబాటులో ఎవరో ఒకరి సెల్‌నెంబర్‌కు ఓటీపీ వచ్చినా ఆ రైతుకు టోకెన్ ఇచ్చేవారు. కానీ రైతు ఆధార్‌కార్డుకు లింకైన ఫోన్‌నెంబర్‌కు వచ్చిన ఓటీపీనే ఇప్పుడు పరిగణిస్తున్నారు. దాని ఆధారంగానే టోకెన్ ఇవ్వాలని చెబుతు న్నారు. అసలే రైతుకు ఫోన్లు ఉండవు. ఒకవేళ ఉన్నా ఆ ఫోన్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిదగ్గర ఉంటుంది. ఆఫోన్ వాడుతు న్నారో, లేదో తెలియదు. వాడకపోతే ఆ సిమ్‌కార్డును మరొకరికి అలాట్ చేస్తారు. ఓటీపీ చెప్పకపోతే టోకెన్ రాదని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఎంతో మంది రైతులను ఓటీపీ పేరుతో తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధార్‌కు ఫోన్‌నెంబర్ లింక్ చేయాలనుకున్నా.. ఆ ప్రాసెస్ కోసం 15 రోజులు పడుతున్నది. ఈలోపు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలును సాధ్యమైనంతమేరకు తగ్గించమని ప్రయత్నిస్తున్నది. అందుకు ఎన్నో మెలికలు పెడుతున్నది. కొన్నిచోట్ల ధాన్యాన్ని కొనడం ప్రారంభించారు. వరి దిగుబడి పెరగడంతో కొనుగోలు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మార్కెట్ యార్డులకు కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నాణ్యత ఉంటేనే ధాన్యాన్ని కొనాలని చెబుతున్నారు. తాజాగా రైతుల వివరాలు అప్్లోడ్ చేసి, ఓటీపీ చూపిస్తేనే టోకెన్ ఇస్తామంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సర్క్యూలర్ జారీ చేశారు. సూర్యాపేట జిల్లాలో ముందుగా టోకెన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించడానికి రైతు ఎంతగా శ్రమిస్తారో, అంతకంటే అమ్ముకోవడానికి శ్రమించాల్సి వస్తున్నది.
క్వాంటిటీ కాదు... క్వాలిటీయే కీలకం
రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం చెప్పింది. ఇన్ని రోజులు రైతులు ఆ భరోసాతోనే ఉన్నారు. ఇప్పుడు క్వాంటిటీతో సంబంధం లేకుండా నాణ్యత (క్వాలిటీ) ఉండాలంటూ మెలిక పెట్టారు. ఏదో ఒక వంక పెట్టి రైతును మార్కెట్ నుంచి ఇంటికి పంపించే ప్రభుత్వం చూస్తున్నది. రైతుకు టోకెన్ కావాలంటే, ధ్రువపత్రాలను పోస్టాఫీస్, బ్యాంకులు, ఇంటర్నెట్ సెంటర్లు ఎక్కడైనా సరే అప్్లోడ్ చేయాలి. దీంతోపాటు మాన్యువల్ కోసం జిరాక్స్ సెట్ మార్కెట్ యార్డులో ఇవ్వాలి. ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలకు, మాన్యువల్ జిరాక్స్ కాపీలకు పోలిక కుదరాలి. అప్పటికి కానీ రైతుకు ధాన్యం అమ్ముకోవడానికి అర్హత సాధిస్తారు. లేకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. వరి నాణ్యత విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొలా ఉంటాయి. ఉత్తర, దక్షణ తెలంగాణ ప్రాంతాల్లో తేడా ఉంటుంది. ప్రాజెక్టుల కింద పండిన ధాన్యానికి, బోర్లు, బావులకింద పండిన ధాన్యానికి నాణ్యతతో తేడా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి నాణ్యత ఉంటుంది. కానీ ప్రభుత్వం రైతులకు షరతులు పెట్టి మార్కెట్‌కు రాకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నది.
దోసెడు గింజలొద్దు... దోసిళ్లు పోయాలి
వరి ధాన్యాన్ని రైతు మార్కెట్ తీసుకొస్తే దొసెడు గింజలు సంతోషంతో అక్కడి సిబ్బందికి పెట్టేవారు. ఇప్పుడు దోసిళ్ల ధాన్యాన్ని పోయాల్సి వస్తున్నది. పేరుకు కిలో లెక్కన కాకుండా దోసిళ్లతో పోస్తున్నారు. అలా పోస్తే కాంటా వేస్తారు. లేకపోతే ఏవో కొర్రీలు పెడుతున్నారు. మట్టి, తాలు, పచ్చిగా ఉన్నాయంటూ రైతులను భయాందోళలకు గురి చేస్తున్నారు. మళ్లీ వెనక్కి పంపిస్తారేమోనని రైతు కూడా సరే అనకతప్పని దుస్థితి ఉన్నది. వీటిని ఆసరా చేసుకుని మిల్లర్లు కూడా తమకు ఇస్టానుసారం తరుగు తీసుకుంటారు. లోడ్‌లోని బస్తాల్లో కొన్ని శాంపిళ్లను తీసుకుని మిల్లర్ సగటున లెక్కలేసి తరుగు తీస్తారు. ఆ లోడ్‌లో ఎంత మంది రైతుల ధాన్యం ఉందో, వారందరికి తరుగు వర్తిస్తున్నది. దానికి పరిమితి అంటూ లేదు. తోచినంత తరుగు తీస్తున్నారు. ఆ తర్వాతతే రైతు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఒక్కొక్కసారి రైతుల వివరాలు రాంగ్ ఎంట్రీ అవుతుంటాయి. దాంతో కూడా రైతుకు తిప్పలు తప్పడం లేదు.
దళారులకు 'ఆయుధం'
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరి దళారులకు ఆయుధంగా మారుతున్నది. ధాన్యం అమ్ముకోవడానికి ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో ప్రయివేటు వ్యాపారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటా ధర రూ 1,960 కొనుగోలు చేస్తున్నది. ప్రయివేటు వ్యాపారులు రూ 1,500, రూ 1,550 మించి ఇవ్వడం లేదు. దీంతో రైతులు పడిన కష్టానికి ఫలితం లేకుండాపోతున్నది.