Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు అమలు చేస్తే వాలంటీర్‌గా పనిచేస్తాం
- ఈ నెల 15న గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం : కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతి కేజీ, ప్రతి గింజా కొంటామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దళితబంధును పూర్తిస్థాయిలో అమలు చేస్తే బీజేపీ నేతలమంతా సేవకులుగా పనిచేస్తామని ప్రకటించారు. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న గిరిజన జాతీయ గౌరవ దినోత్సవాన్ని, 22వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శనివారం హైదారాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిర్సా ముండా మరణించిన జార్ఖండ్‌లోని జైలును మ్యూజియంగా మార్చబోతున్నామన్నారు. ఈ నెల 15న మధ్యప్రదేశ్‌లో రెండు లక్షల మంది గిరిజనులతో సభ తలపెట్టామని చెప్పారు. తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం కోసం 2019-2020లో కేంద్రం ఇస్తామన్న రూ.15 కోట్లకు తోడుగా రాష్ట్రం ప్రభుత్వం హామీనిచ్చిన రూ.3 కోట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమర యోధుల పుస్తకాల ప్రచురణకు కూడా ఆర్థిక చేయూత అందిస్తామని హామీనిచ్చారు. సమ్మక్కసారలమ్మ జాతరకు రూ.2 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఎయిమ్స్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలని సూచించారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదనీ, దీనిపై మూడేండ్లుగా కేంద్రం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తున్నదని చెప్పారు. ఎనిమిదిన్నర శాతం కమిషన్ ఇచ్చి మరీ ధాన్యం తీసుకుంటున్నామన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రం కోటాగా నిర్ణయించగా..కేసీఆర్ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేస్తామని కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఇప్పుడు 108 లక్షల మెట్రిక్ టన్నులని మరో లేఖరాయడం హాస్యాస్పదమన్నారు. 2020-21లో ధాన్యం సేకరణకు రూ.26,400 కోట్లను కేటాయించా మన్నారు. 2012-13 లోతెలంగాణ, ఏపీలో కలిపి 64 లక్షల మెట్రిక్ టన్నులను సేకరిస్తే ఇప్పుడు 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు తనవల్లే దక్కిందంటున్న కేసీఆర్..ప్రగతిభవన్‌లో కూర్చుని 19 దేశాల అధ్యక్షులతో మాట్లాడి ఓట్లు వేయించారా? అని ప్రశ్నించారు. ఎమ్ఎమ్టీఎస్ రెండో దశ అభివృద్ధి పనులు చేపట్టాలని లేఖ రాస్తే నేటికీ స్పందించలేదన్నారు. ధర్నాచౌక్ వద్దన్నవాళ్లే అదే స్థలంలో ధర్నాలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు కూడా రావాలని ఆకాంక్షించారు.