Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్, పెట్టుబడిదారులకు మేలు చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాల్రాజ్, వీఎస్బోస్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్ విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని మగ్దూం భవన్లో ఏఐటీయూసీ రాష్ట్రస్థాయి చర్చా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మోడీ సర్కారు పేదల కోసం పనిచేయడంలేదనీ, అంబానీ, ఆదానీ లాంటి పెద్దల కోసమే పనిచేస్తున్నదని చెప్పారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఒక వ్యాపార పార్టీ అనీ, పరిశ్రమల అధిపతుల పార్టీ అని విమర్శించారు. కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే హక్కులుండబోవని హెచ్చరించారు. పరిశ్రమలో 51 శాతం మంది కార్మికులు ఓటు వేస్తేనే గుర్తింపు సంఘంగా గుర్తిస్తామని చెప్పటడం దారుణమని విమర్శించారు. పారిశ్రామిక వివాదాల హక్కులను కాలరాయడం అన్యాయమన్నారు. రాష్ట్రం ప్రభుత్వం కూడా కేంద్రానికి వంతపాడుతూ కోడ్లను అమలు చేసేందుకు పూనుకున్నదని పేర్కొన్నారు. కోడ్లు అమలైతే ఏ పరిశ్రమలోనూ పర్మినెంట్ ఉద్యోగాలు ఉండబోవని హెచ్చరించారు. కోడ్లను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నిరసనలు తెలపాలనీ, కొత్త చట్టాలను అవగాహన చేసుకోవాలని కోరారు. కోడ్ల రద్దు కోసం కార్మికులు సంఘటితంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.