Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఉద్యమం తప్పదు
- మోడీ ప్రభుత్వానికి బీసీ సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓబీసీ కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలనీ, లేందంటే ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు హెచ్చరించాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్స్ట్ కాలేజీ వద్ద శనివారం అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం, జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంయుక్తంగా శనివారం ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఓబీసీల జనాభాను గణిస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు అమలు చేయకుండా సాకులు చెబుతుందని తెలిపారు. కుల గణన లేకుండా సామాజిక, విద్యా, ఆర్థిక విధాన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.వెనుక బడిన తరగతులకు సంక్షేమ పథకాలు ఏ ప్రాతిపదికన అమలు చేస్తారో చెప్పాలన్నారు. జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో 76కోట్ల ఓబీసీ ల జనాభా లెక్కలు తీయకపోవడంతో అనేక రకాలుగా నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత ఓబీసీ విద్యార్ధి సంఘం నేతలు జి. కిరణ్ కుమార్, వై. శివ కుమార్, లింగస్వామి, స్వామి గౌడ్, కొండల్, రవితేజ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.