Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి సాగు నుంచి రైతుల దృష్టిని మళ్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. అధికారులు మనసుపెట్టి పనిచేస్తే, పంటలమార్పిడి అనేది పెద్ద విషయం కాదని తెలిపారు. వరి పొలంలో మినుములు, పెసర్లు వేయాలని కోరారు. శనివారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఉద్యానవన శాఖలో జరిగిన వ్యవసాయ అధికారుల శిక్షణా కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆముదాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉందనీ, దేశంలో తగినంత ఉత్పత్తి లేదన్నారు. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించేలా రైతులను చైతన్య పరచాలని కోరారు. పప్పుగింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పారు. పంటలమార్పిడి, వైవిద్యీకరణపై గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు.
ఏడేండ్లలో రాష్ట్రానికి ఏం చేశారు
ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం బీజేపీ మంత్రి, ఎంపీలు ఒక్కటంటే, ఒక్కటయినా తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతన్నలతో గోక్కోవద్దంటూ బీజేపీకి సూచించారు. బీజేపీ నేతలు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్రం తాత్కాలికంగా నూతన వ్యవసాయ చట్టాలు అమలుచేయడం లేదన్నారు. అయినా సాగు చట్టాలు రైతుల మెడకు కత్తిలా వేలాడుతూనే ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం వడ్ల కొనుగోలు విషయంలో పున:సమీక్షించుకోవాలని కోరారు.