Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
- కంటోన్మెంట్ ప్రాంతాల్లో సమాంతర పాలన సహించం
- రాష్ట్రంలోని మున్సిపాల్టీలకు 12 జాతీయ అవార్డులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పాలనలో భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్రప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వట్లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బెంగుళూరు మెట్రోకు రూ.22వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల మౌలిక సౌకార్యలకు సంబంధించిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. నిధులు, హక్కుల కోసం కేంద్రం వెంటపడతామనీ, ఇదే తరహా సహాయ నిరాకరణ కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో నిరసనలు వ్యక్తంచేస్తామని హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతు ధర్నాలు అందులో భాగమేనని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో రక్షణ శాఖ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నదనీ, దీన్ని సహించబోమని అన్నారు. ఇష్టం వచ్చినట్టు రోడ్లు మూసేయడం, కాలువలపై అనుమతులు లేకుండా చెక్‌డ్యాంలు కట్టడం వంటి పనులను ఆశాఖ చేస్తున్నదని ఆక్షేపించారు. రక్షణశాఖకు దీనిపై మర్యాదపూర్వకంగా చెప్పామనీ, వినకుంటే కేసులు పెట్టి, నిరసనలు తెలుపుతామని అన్నారు. శనివారంనాడిక్కడి పురపాలకశాఖ డైరెక్టరేట్ కార్యాలయం (సీడీఎమ్ఏ)లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు జాతీయ స్థాయి శానిటేషన్ ఛాలెంజ్ పోటీల్లో 12 అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగే స్వచ్ఛ అమృత్ మహౌత్సవ్ కార్యక్రమంలో ఈ అవార్డులు అందచేస్తారని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్, గార్బేజ్ ఫ్రీ సిటీ అంశాల్లో పోటీలు నిర్వహించి, ఈ అవార్డులు ప్రకటించారని వివరించారు. దేశవ్యాప్తంగా 4,300 పట్టణాలు, నగరాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఏకకాలంలో అద్భుతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. టీఎస్-బీపాస్ సహా అనేక కొత్త ఆవిష్కరణలు చేపట్టామనీ, పౌరులపైనే బాధ్యతలు పెట్టామని అన్నారు. నూతనంగా గ్రీన్‌బడ్జెట్ ప్రవేశపెట్టామనీ, అర్బన్ మిషన్ భగీరధను అమల్లోకి తెచ్చామనీ వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై మరోసారి మాట్లాడతానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాతబస్తీ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.15వేల కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. అవార్డులు రావడానికి కృషి చేసిన పురపాలకసంఘాల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, సీడీఎమ్ఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ పాల్గొన్నారు.