Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్రాలో తండ్రిని హత్య చేయించిన కూతురు
- జులైలో ఘటన.. ఆలస్యంగా బయటపడిన వాస్తవాలు
నవతెలంగాణ- నేరేడ్మెట్/కాప్రా
ప్రాణం పెట్టి చూసుకునే కన్నతండ్రి ప్రేమ కంటే ప్రియుడే ముఖ్యమనుకుంది ఓ కూతురు. తమ ప్రేమను ఒప్పుకోలేదని తండ్రిని హత్య చేయించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కాప్రాలో జరిగింది. అయితే, జులైలో ఈ ఘటన జరగ్గా.. పోలీసుల విచారణ అనంతరం ఆలస్యంగా విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 20న కాప్రాలో రామకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొంతు నులిమి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. కుటుంబ మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. రామకృష్ణ కూతురు నారాయణగూడకు చెందిన భూపాల్ను ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం ఇష్టంలేని తండ్రి యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో కొన్ని రోజులు జైలులో గడిపాడు. అనంతరం రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నాడు. రామకృష్ణను చంపేందుకు అతడి కుమార్తె అయిన ప్రియురాలితో కలిసి ప్లాన్ చేశాడు. హత్య చేస్తే రూ.2 లక్షలు ఇస్తానని మిత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పక్కాప్లాన్ ప్రకారం.. రామకృష్ణ కుమార్తె జులై 19న తండ్రికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రమత్తులో ఉండగా ఆమె ప్రియుడు భూపాల్ తన మిత్రులతో కలిసి రామకృష్ణను గొంతు నులిమి, కణతిపై పొడిచి పారిపోయారు. కూతురు కూడా ఏమీ తెలియనట్టు నటించింది. కిందపడ్డాడనుకుని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా జులై 20న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. కూతురే ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించినట్టు తేలింది.